హైదరాబాద్లో పీఈటీ అభ్యర్థుల ధర్నా కారుణ్య మరణాలకు అనుమతినివ్వాలంటూ గురుకుల పీఈటీ అభ్యర్థులు హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు(PET candidates protest in Hyderabad) దిగారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయలేదని కుటుంబ సభ్యులతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గురుకుల పీఈటీ నియామకాలపై స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపికైన అభ్యర్థులు(PET candidates protest in Hyderabad) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"గురుకుల పీఈటీ నియామకాల విషయంలో స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 1:1 ద్వారా గురుకుల పీఈటీ అభ్యర్థుల ఫలితాలను టీఎస్పీఎస్సీ వెంటనే ప్రకటించి నియామకాలు చేపట్టాలి. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు."
- పీఈటీ అభ్యర్థి
"చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తోంది. 616 పోస్టులకు 1,232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యారు. 2018 మే లో అభ్యర్థుల వెరిఫికేషన్ జరిగింది. 2021లో హైకోర్టు స్టే ఎత్తివేసింది. కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తాం."
- పీఈటీ అభ్యర్థి
"కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 8 నెలలు ఎదురుచూశాం. ఇప్పటివరకు ఫలితాలు రాలేదు. నియామకాలు చేపట్టలేదు. టెక్నాలజీ ఇంత పెరిగినా.. రోజుకో అద్భుతం జరుగుతున్నా.. ఇంకా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పడం విడ్డూరంగా ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ 24 గంటలు కూర్చుంటే.. మా జీవితాలే మారిపోతాయి. అధికారుల వల్లే మా జీవితాలు అంధకారంలోకి వెళ్లాయి. వాళ్లే మా పొట్ట కొడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదా. వారంలోగా మాకు లిస్ట్ పెట్టకపోతే టీఎస్పీఎస్సీ ముందు ఎన్ని శవాలు లేస్తాయో తెలియదు. ఐదేళ్లు వేచిచూశాం. ఇక ఎదురుచూడటం మావల్ల కాదు."
- పీఈటీ అభ్యర్థి