వరి పంటను కబళిస్తున్న రెండు ప్రధాన తెగుళ్ల నివారణకు దక్షిణ అమెరికా అడవుల్లో పెరిగే అడవి వరి గడ్డి జాతి మొక్క జన్యువు ఉపయోగపడుతుందని పరిశోధనల్లో గుర్తించారు. వరిలో ఆకు ఎండు అగ్గి తెగులు, మెడ విరుపు తెగులు వల్ల ధాన్యం దిగుబడి సగటున 30 శాతం వరకూ తగ్గుతోంది. ఏటా ఇలా నష్టపోయే ధాన్యం విలువ ప్రపంచవ్యాప్తంగా రూ.42వేల కోట్లు ఉంటుందని ...భారత వరి పరిశోధనా కేంద్రం(ఐఐఆర్‌ఆర్) అధ్యయనంలో తేలింది.
పీఏ68(టి)
పీఏ68(టి)’ జన్యువుతో దక్షిణ అమెరికా అడవుల్లో పెరిగే ‘ఒరైజా గ్లమెపటుల’ అనే వరి గడ్డి జాతి మొక్కలోని జన్యువులను తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగవుతున్న సాంబమసూరి(బీపీటీ5204) వరి వంగడంలో చొప్పించారు. ఒరైజా గ్లమెపటులకు అగ్గితెగులు రాకుండా తట్టుకునే శక్తి ఉండటం వల్ల అందుకు దానిలో ‘పీఏ68(టి)’ అనే జన్యువును గుర్తించి సాంబమసూరిలో ప్రవేశపెట్టారు.
పరిశోధన ఫలించింది
ఈ పరిశోధనలు ఫలించాయని ఐఐఆర్‌ఆర్ ప్రధాన వరి శాస్త్రవేత్త శేషుమాధవ్ తెలిపారు. ఈ కొత్త వంగడాలను వీలైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు కీలకదశకు చేరుకున్నాయన్నారు.
అగ్గితెగులు విజృంభణ
ప్రస్తుతం తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 38 లక్షల ఎకరాలకు చేరింది. ప్రస్తుతం పైరు చిరుపొట్ట దశ నుంచి ధాన్యం గింజ గట్టిపడే దశలో ఉంది. కానీ మెడవిరుపు, అగ్గి తెగులు అన్ని జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు.
గత నెలలో వరి ఆకులపై ఏర్పడిన అగ్గి తెగులు మచ్చలు ఇప్పుడు వరిపైరు కణుపులకు వ్యాపించాయి. ఈ తెగులు సోకిన మొక్కలు గోధుమ లేదా ముదురు గోధుమ రంగుకు మారి కణుపులు కుళ్లిపోతున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు వర్శిటీ పరిశోధనా సంచాలకుడు, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ్వర్ ‘ఈనాడు’కు చెప్పారు.
వరి కంకులు వేసే గొలుసు మెడపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తరవాత ఎండిపోయి కంకులు విరిగి వేలాడుతుంటాయి. కంకుల్లోని వరి గింజలు తాలుగా మారి దిగుబడి పడిపోతోంది. గత నెలలో రాష్ట్రంలో తేమశాతం అధికంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలితీవ్రత కారణంగా అగ్గితెగులు పెరిగింది. తెగులును వ్యాపింపచేసే శిలీంధ్ర పాథోటైప్‌లో మార్పుల వల్ల గతంలో కన్నా మరింత శక్తిమంతమైంది.
అగ్గితెగులు నివారణకు ట్రై సైక్లోజెల్ అనే పురుగుమందును ఏళ్ల తరబడి చల్లుతున్నందున దాన్ని తట్టుకుని తెగులు వృద్ధి చెందుతోంది. పురుగుమందుతోపాటు యూరియా వేస్తుండటం వల్ల సమస్య మరింత జటిలమైంది.