తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎగువ భద్రకు పెట్టుబడి అనుమతి... వేగంగా కదిలిన దస్త్రం - upper bhadra project works

కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం అత్యంత వేగంగా పెట్టుబడి అనుమతి మంజూరు చేసింది. గత డిసెంబరు 24న జరిగిన కేంద్ర జల సంఘం 147వ సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశం ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇది జరిగిన మూడు నెలలకే పెట్టుబడి అనుమతి లభించింది. గురువారం ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమైన పెట్టుబడి అనుమతుల కమిటీ రూ.16,125 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఎగువ భద్ర ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి కేంద్రానికి మార్గం సుగమమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఇదే ఆశాభావంతో ఉన్నారు.

upper bhadra project, permission
upper bhadra project

By

Published : Mar 27, 2021, 6:41 AM IST


ఎగువ భద్ర ప్రాజెక్టు వల్ల తుంగభద్ర, శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహాలపై ప్రభావం పడుతుందని ఒకవైపు తెలుగు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇంకోవైపు కేంద్రం చకచకా అన్ని అనుమతులు ఇచ్చేసింది. 17.4 టీఎంసీల నీటిని తుంగ నది నుంచి భద్ర రిజర్వాయర్‌కు ఎత్తి పోస్తారు. భద్ర రిజర్వాయర్‌ నుంచి మొత్తం 29.9 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 5.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడంతోపాటు 367 చెరువులను నింపుతారు. ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తే ఇప్పటివరకు చేసిన ఖర్చు పోనూ మరో రూ.పది వేల కోట్ల వరకు కర్ణాటకకు వస్తాయి.

తెలంగాణ ఎన్నోసార్లుగా విజ్ఞప్తి చేస్తున్నా...

మరోవైపు తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు 2018 జూన్‌లో జరిగిన కేంద్ర జల సంఘం 136వ సాంకేతిక సలహా కమిటీ సమావేశంలో అనుమతి లభించింది. అప్పటి నుంచి పెట్టుబడి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసింది. 2018లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మంత్రుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. ఎంపీలు లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటివరకు అనుమతి రాలేదు.
*ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాను 146వ టీఏసీ సమావేశంలో ఆమోదం లభించింది. దీనికి కూడా ఇప్పటివరకు పెట్టుబడి అనుమతి రాలేదు. పైగా టీఏసీ సిఫార్సు చేసిన మొత్తంలో సగం మాత్రమే ఇచ్చేలా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అత్యంత వేగంగా ఎగువ భద్రకు పెట్టుబడి అనుమతి ఇచ్చిన వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పెట్టుబడి అనుమతి వల్ల ప్రయోజనం ఏంటంటే...

భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి ఆర్ధిక సాయం కావాలన్నా పెట్టుబడి అనుమతి అవసరం. అంతర్‌ రాష్ట్ర సమస్యలు, ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులపైన ప్రభావం చూపే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు మొదట కేంద్ర జలసంఘం అనుమతి అవసరం. నీటి లభ్యత, అటవీ, పర్యావరణ, గిరిజన మంత్రిత్వశాఖ, పెట్టుబడి-ప్రయోజనం తదితర అంశాలన్నింటిపైన సంతృప్తి చెందిన తర్వాత కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలుపుతుంది. తర్వాత పెట్టుబడి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపుతాయి. 2015 వరకు ప్రణాళికా సంఘం దీనిని మంజూరు చేసేది. అది రద్దయి నీతి ఆయోగ్‌ ఏర్పడిన తర్వాత కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఈ అధికారం లభించింది. ఈ శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా గల కమిటీ సిఫార్సు చేస్తే దానికి కేంద్రమంత్రి ఆమోదం తెలిపిన తర్వాత పెట్టుబడి అనుమతి లభిస్తుంది. అనంతరం కేంద్రం నుంచి ఆర్థికసాయం లభించడానికి అవకాశం ఉంటుంది. గతంలో సత్వర సాగునీటి ప్రయోజన పథకం ద్వారా 30 శాతం నుంచి 90 శాతం వరకు కూడా నిధులు లభించేవి. ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్‌ యోజన ద్వారా లభిస్తోంది. నాబార్డు నుంచి కూడా రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్రం జాతీయ హోదా కల్పిస్తే నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులు వస్తాయి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉన్నా సవరించిన అంచనాకు ఆమోదం లభించాల్సి ఉంది.

ఇదీ చూడండి:వేసవిలో సరికొత్తగా.. ఆరోగ్యం, చల్లదనంతో 'జ్యూస్ బాక్స్​'

ABOUT THE AUTHOR

...view details