‘హాయ్ హనీ... మీ సోనీని తీసుకెళ్లే స్పా లొకేషన్ ఓసారి షేర్ చేయవా... మా స్నోయీ హెయిర్ డ్రై అయిపోతోంది. ముఖం కూడా వాడిపోయింది, అందులోనూ దాని బర్త్‌డే కూడా దగ్గరపడుతోంది. ఈసారి గ్రాండ్‌గా పార్టీ చేయాలనుకుంటున్నా’ అంటూ స్నోయీ గురించిన తన దిగులునంతా స్నేహితురాలి దగ్గర గుక్కతిప్పుకోకుండా ఏకరువు పెట్టేసింది మహిత. అవునండీ... ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పెంపుడు కుక్కల్ని తమ పిల్లలతో సమానంగా పెంచుకునేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది..!
శునక వైభోగం
By
Published : Apr 11, 2021, 7:45 PM IST
నక్షత్రాల్లా మెరిసే నీలి కళ్లూ పట్టుకుచ్చులాంటి జుట్టూ చట్టి ముక్కుతో చూడగానే ముద్దొచ్చే డెయిజీ దినచర్య మినరల్ వాటర్ తాగడంతో మొదలవుతుంది. ఆపై వాకింగ్‌కి వెళ్లొచ్చి, డైనింగ్ టేబుల్‌మీద పెట్టిన ఖరీదైన ఆర్గానిక్ స్నాక్స్ తిని, అనుచరులు వెంట రాగా దర్జాగా స్పా స్నానానికి బయలుదేరుతుంది. వింతగా అనిపించినా సంపన్నుల ఇళ్లలోని కుక్కల దర్జా ఇలాగే ఉంది.
‘ఏం రాజయోగంరా... మనకన్నా వాటి పనే నయం’ అని ఎందరో ఈర్ష్యపడేంత ప్రేమగా విలాసంగా వాటిని పెంచుతున్నారు ఈతరం శ్రీమంతులు. అన్ని రకాల వసతుల్నీ సమకూరుస్తున్నారు. సంపన్నులే కాదు, ఎగువ మధ్యతరగతివాళ్లు సైతం పిల్లలతో సమానంగానే వాటికీ ప్రేమని పంచుతున్నారు. బుజ్జి కుక్కపిల్లని ఎంతో ముద్దుగా రెడీ చేస్తున్నారు.
దానికోసం బోలెడు బట్టలు కొంటున్నారు. పుట్టినరోజులూ పెళ్లిరోజులూ చేస్తున్నారు. డాగ్ లవర్లనీ పెట్ ఓనర్లనీ పిలిచి ఆడంబరంగా వేడుకలు చేయడంతోపాటు ఖరీదైన హోటళ్లలో వాటికి స్పెషల్ ట్రీట్‌లూ ఇస్తున్నారు. ఈడొచ్చాక తమ రాణీగారికి రాజకుమారుడితో పెళ్లి చేసి హనీమూన్‌కి సూట్ బుక్ చేసి పంపించే సరదా ప్రియులూ ఉన్నారు. ఈమధ్యే ఖమ్మం జిల్లాకి చెందిన ఓ కుటుంబం శ్రీమంతం చేసి ఆ ముచ్చటా తీర్చుకుంది.
ఇన్‌స్టా పోస్టుల్లోనూ..!
సోషల్‌మీడియా ట్రెండ్‌కి పెంపుడు కుక్కలేం మినహాయింపు కాదు. రోజుకో రకం డ్రెస్సు వేసి నగలు పెట్టి యాక్సెసరీలు తగిలించి ఫొటోలు తీసి తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో పోస్టు చేయడంతో తృప్తి పడటం లేదు నేటి శునకప్రియులు. వాటికోసమే ప్రత్యేకంగా పేజీలు తెరిచి తిండీ అల్లరీ, ఆటలూ.. ఇలా ఒకటేమిటీ వాటి గురించిన ప్రతీదీ అందులో పెట్టేస్తున్నారు. దాంతో వాటికోసం ప్రత్యేకంగా షాపింగ్ చేయక తప్పడం లేదు. ‘ఇంతకుముందు నాలుగైదు డ్రెస్సులు కొంటే సరిపోయేది.
కానీ ఇప్పుడు వార్డ్‌రోబ్ అంతా మా సోఫీ డ్రెస్సులకే సరిపోతుంది’ అంటోంది సుస్మిత. అందుకే, కుక్కల ఫుడ్డూ ఆటబొమ్మలతోపాటు డిజైనర్ దుస్తులూ యాక్సెసరీలూ ఫర్నిచరూ నగల కోసం ఎన్నో షాపులు వెలుస్తున్నాయి. నిజానికి ఈ పెట్ లవర్స్ తమకోసం కన్నా తమ కుక్కలకోసమే ఎక్కువ సమయాన్నీ డబ్బునీ వెచ్చిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు నెలకో మూడునెలలకో గ్రూమింగ్‌కి తీసుకెళ్లేవారట. ఈమధ్య వారం, రెండు వారాలకీ సెలూన్లకీ స్పాలకీ తీసుకెళుతుంటే సిట్టింగ్‌కి వెయ్యి నుంచి నాలుగైదు వేల వరకూ అవుతోందట.
వాటి సౌందర్యపోషణ కోసమే పాతిక ముప్ఫై వేల దాకా కేటాయిస్తున్నారు. అప్పట్లో పెట్ గ్రూమింగ్ అంటే జుట్టూ గోళ్లూ కత్తిరించి చెవులూ పళ్లూ శుభ్రం చేసి స్నానం చేయించడమే ఉండేది. కానీ ఇప్పుడలా కాదు, హెయిర్ స్టైలింగ్, స్పా ట్రీట్‌మెంట్, ‘పా’డిక్యూర్ వంటివన్నీ చేయించాలి. ఇలా విలాసంగా జీవితాన్ని గడిపే రిచ్ డాగ్‌లెన్నో.
షికారుకెళ్ళొద్దాం..!
ఎప్పుడూ మనుషులతోనే ఉంటే వాటికి మాత్రం బోర్ కొట్టదూ... అందుకే శునక దోస్తులతో కలిసి హాయిగా గడిపేందుకన్నట్లు అచ్చంగా పెట్స్ కోసమే కెనైన్ ఎలైట్, క్రెట్టెరాటి... వంటి హోటళ్లు పుట్టుకొస్తున్నాయి. గురుగ్రామ్‌లోని క్రెట్టెరాటిలో అయితే ఒక్క రాత్రికి మూడునాలుగు వేలు వెచ్చించాల్సిందేనట. అయినా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా తమ పెంపుడు కుక్కల్ని ఆ హోటల్‌కి పంపిస్తున్నారట. తీసుకెళ్లడం కుదరని వాళ్లకి పికప్ అండ్ డ్రాపింగ్ సర్వీసుని కూడా హోటల్‌వాళ్లే చేస్తున్నారు. తాజ్ వివాంటా, ఫోర్ సీజన్స్, ద డ్యూన్ ఎకో విలేజ్ అండ్ స్పా... వంటి స్టార్ హోటళ్లూ రిసార్టులూ శునకరాజాల్ని ఆనందంగా స్వాగతిస్తున్నాయి.
ప్రత్యేక సెంటర్లు...
ఇక, వాటికోసం తెరిచిన సెలూన్లూ డే కేర్ సెంటర్లూ అయితే లెక్కే లేదు. కొన్నిచోట్ల వాటికోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతో కూడిన హాస్పిటళ్లూ ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వాటికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకమైన స్కూళ్లూ బోర్డింగు హోమ్‌లూ వీకెండ్ విరామం కోసం రిసార్టులూ ప్రారంభిస్తున్నారు. అవి కాస్త మూడీగా కనిపించినా బయటి వ్యక్తులతో అమర్యాదకరంగా ప్రవర్తించినా వాటి మందబుద్దిని పొగొట్టి బుద్ధిమతి నేర్పే కౌన్సెలింగ్ సెంటర్లూ పుట్టుకొచ్చాయి. హఠాత్తుగా దానికేదయినా జబ్బు చేస్తేనో... అన్న భయంతో ఇన్సూరెన్సు పాలసీలూ చేస్తున్నారు. గురుగ్రామ్‌కి చెందిన ఓ కెన్నెల్‌లో అయితే డైటింగ్ సెంటరూ ఉంది.
కొవ్వు కరిగించి...
అక్కడ వాటితో బాగా వ్యాయామం చేయించి కొవ్వుని కరిగించి పంపిస్తారట. దీన్నిబట్టి మన దగ్గరా శునకాల్ని ఎంత ముద్దు చేస్తున్నారో అర్థమవుతోంది. అంతేనా... వాటికోసం తమ విందువినోదాల్నీ వదులుకుంటున్నారు. వాటికి ఇబ్బంది అవుతుందేమోనని ఊళ్లకు వెళ్లనివాళ్లు కొందరైతే, వాటితోసహా తమ పర్యటనల్నీ ప్లాన్ చేసుకునేవాళ్లు మరికొందరు. కొందరయితే విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు- వాటినీ వెంటపెట్టుకునే వెళుతున్నారు. ఆ మధ్య హాంకాంగ్‌కు చెందిన జోమాన్ అనే వ్యాపారవేత్త తన పెంపుడుకుక్కలతో పర్యటించేందుకు ఓ ప్రైవేటు జెట్ బుక్ చేయించుకుని మరీ వెళ్లిందట. ఇలాంటివాళ్లు చాలామందే ఉన్నారు. అందుకే లైఫ్ ట్రావెల్ వంటి కంపెనీలు పెట్ మైల్స్ పేరుతో వాటికీ యజమానులకీ కలిపి మరీ పర్యటనల్ని నిర్వహిస్తున్నాయి.
ఇక, విదేశాలకు తరలి వెళ్లేవాళ్లయితే వాటిని వదిలి వెళ్లలేరు, అలాగని వెంట తీసుకెళ్లలేరు. వ్యాక్సినేషన్లూ రక్తపరీక్షలు చేయించడంతోపాటు అనేక అనుమతుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పెట్‌ఫ్లై, ఫర్రీ ఫ్లయిర్స్ వంటి సంస్థలు ఆ బాధ్యతని తమమీద వేసుకుని, వాళ్లు వెళ్లే దేశాన్ని బట్టి యాభై నుంచి పన్నెండు లక్షలరూపాయల వరకూ ఫీజు వసూలు చేస్తున్నాయి. దానికీ వెనుకాడటం లేదట. ఇంత ఖర్చు పెట్టడానికి కారణమేంటీ అంటే- అవి చూపించే నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసాలే. వాటి ఆప్యాయతకి ఎంతటి కఠిన హృదయమైనా స్పందించకుండా ఉండదు అంటారు వాటి యజమానులు.