Damaged Roads In Amaravati:ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడి గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పననూ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర భవిష్యత్‌కు దారి చూపుదామని రాజధానికి భూములిచ్చిన వారికి కనీసం నడవడానికి సరైన రోడ్డు కూడా లేకుండా పోయింది. గ్రామాలను అనుసంధానించే మార్గాలు మూసుకుపోయినా ప్రభుత్వ వర్గాల్లో కదలిక లేదని రాజధాని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వివిధ పనుల కోసం సెక్రటేరియట్‌కు వచ్చే సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొలువైన అత్యున్నత విద్యాసంస్థలకు రాకపోకలు సాగించే విద్యార్థులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. గజానికో గుంత, అడుగేస్తే అడుసు అన్నంత దారుణంగా తయారైన ఈ రహదారులు.. రాష్ట్రానికే దిక్సూచిలా నిలుస్తుందనుకున్న రాజధాని అమరావతి గ్రామాల దుస్థితి అద్దం పడుతున్నాయి.
ఊళ్లను అనుసంధానించే రహదారులతోపాటు అంతర్గత రోడ్లకూ మూడేళ్లుగా కనీస మరమ్మతులు లేక అధ్వానస్థితికి చేరాయి. అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలోని 29 గ్రామాల్లో కనీస సదుపాయాల మాటే మరిచిపోయింది. రోడ్ల వెంట కంపచెట్లు పెరిగిపోయి, ఆయా ప్రాంతాలను చిట్టడవులను తలపిస్తున్నాయి. పరిస్థితి ఇంత దిగజారినా ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది.
అమరావతిలో ప్రపంచస్థాయి విద్యాసంస్థలు ఉన్నా వాటికి చేరుకునే మార్గాలు మాత్రం హీనస్థితికి చేరాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఇక్కడి వచ్చేవారు.. ఈ రోడ్లను చూసి నవ్వుకుంటున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. విజయవాడ సహా ఇతర ప్రాంతాల నుంచి రోజూ కళాశాలలకు వచ్చే విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.