‘‘30 ఏళ్లుగా నివసిస్తున్నాం. రెండు రోజులు ప్రభుత్వ బడి, సామాజిక భవనాల్లో తలదాచుకున్నాం. విద్యుత్తు లేదు. దుమ్ము తుడుచుకుని పడుకున్నాం. అన్నం పెట్టారు.. తాగునీరు ఇవ్వలేదు. తిరిగి ఇళ్లకు వచ్చేశాం. గుడిసెలు ధ్వంసమయ్యాయి. తిండిగింజలు తడిచిపోయాయి. వస్త్రాలన్నీ బురదమయమయ్యాయి. ఎమ్మెల్యేకి ఫోన్లు చేసినా స్పందించలేదు. అధికారులు సాయం అందించడం లేదు.’’
- వి.నీల, తీగులగూడ
మురుగు, చెత్త మేటలు వేసి..
వరద తగ్గినా ఇళ్లలో కాలు పెట్టలేని పరిస్థితి. గోడలు కూలిపోయే దశకు చేరుకున్నాయి. దుర్గంధం వెదజల్లుతోంది. బ్లీచింగ్ చల్లించడంలేదని గగ్గోలు పెడుతున్నారు. మూసీలో ఎగువ ప్రాంతాల నుంచి ఏ నిమిషంలో వరద వస్తుందోనన్న భయం పరిసర ప్రజలను వెన్నాడుతోంది.
వంతెనలు భద్రమేనా..
వరద ఉద్ధృతికి చాదర్‌ఘాట్ పాతవంతెన రెయిలింగ్ రెండువైపులా కొట్టుకుపోయింది. కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసారంబాగ్ వంతెన రెయిలింగ్ చాలాచోట్ల దెబ్బతింది. వీటిపై ప్రయాణం భద్రమేనా అన్న ఆందోళన నెలకొంది.
రెండు రోజులు తీసినా బురద పోలేదు:
చిన్న గుడిసెలో ఉంటున్నాం. వరద పోటుకు కూలిపోయేలా మారింది. ఇంట్లో మోకాలిలోతు బురద పేరుకుంది. రెండు రోజులుగా శుభ్రం చేస్తున్నా ఇంకా మిగిలే ఉంది. కూలీనాలీ చేసుకుని పొట్టపోషించుకునేవాళ్లం. పనుల్లేక పూట గడవడం ఇబ్బందిగా ఉంది.
నారాయణ, సలీంనగర్
భయపెడుతున్న పాములు, తేళ్లు: ఇళ్లు బాగు చేసుకుందామంటే విషపురుగులు దర్శనమిస్తున్నాయి. పెద్ద పాములు, తేళ్లు వచ్చేశాయి. పాత మలక్‌పేటలోని ప్రాంతాలకు చెందిన కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు.