భారీ వర్షాలు, అధికారుల నిర్లక్ష్యంతో నగర రోడ్లపై చెత్తకుప్పలు పేరుకుపోయాయి. వీటిని తొలగించకపోవడంతో దోమలు వృద్ధి చెంది కాలనీలపై దండెత్తుతున్నాయి. వేలాది మంది వ్యాధుల బారినపడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఒకవైపు డయేరియా, మలేరియా మరోవైపు చికున్‌గన్యాతో మంచానపడుతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా బల్దియా అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపై తక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
పరిస్థితి ఎంత ఘోరమంటే!
మహానగరంలో రోజూ 6,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. కొన్ని నెలలుగా నిత్యం కేవలం 4వేల మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. మిగతాదంతా కాలనీల్లోనూ, రోడ్ల పక్కనే ఉండిపోతోంది. వారం రోజులుగా వర్షాల వల్ల చెత్త కుళ్లిపోయి దుర్గంధంతో కాలనీల్లో ఉండలేని పరిస్థితి నెలకొంటోంది. దోమలు పెరిగి జనం వ్యాధుల బారినపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కొద్దిరోజులుగా ప్రజలు విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు. కానీ మూడు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
మార్కెట్లు మరీ దారుణం!
వర్షాల వేళ నగరంలోని కూరగాయల మార్కెట్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. వ్యాపారులు అమ్మకాలు పూర్తయ్యాక మిగిలిన కూరగాయలు, వ్యర్థాలను ప్రాంగణంలోనే పడేసి వెళ్తున్నారు. వాటిని తరలించకపోవడంతో కుళ్లిపోయి కంపు కొడుతోంది. దీనిపై హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మూడు రోజుల కిందట జీహెచ్‌ఎంసీ నోటీసులిచ్చింది. మాదన్నపేట మార్కెట్‌లో చెత్త తరలింపు అధ్వానంగా ఉందని.. చర్యలు చేపట్టకపోతే మార్కెట్ మూసేస్తామని హెచ్చరించింది. ఇక మెహిదీపట్నం రైతుబజార్, ఎర్రగడ్డ మార్కెట్, భరత్‌నగర్ మార్కెట్, మలక్‌పేట మార్కెట్లలో చిన్న వర్షం పడినా కాలు మోపాలంటే కష్టమే. భరత్‌నగర్ మార్కెట్ సమీపంలో రోజుల తరబడి చెత్తకుప్పలు పేరుకుపోయే ఉంటున్నాయి.