కొవిడ్ టీకాలకు శనివారం నుంచి కొత్త విధానం తెచ్చినా ప్రజలకు కష్టాలు తప్ప లేదు. మొదటి డోసు నిలిపివేసి.. కేవలం రెండో డోసు వారికే టీకాలని చెప్పినా భారీ క్యూలే కనిపించాయి. టీకాల కొరత వేధిస్తోంది. ఉదయాన్నే వచ్చి గంటల తరబడి నిల్చున్నా టోకెన్లు, టీకాలు లభించక జనం ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్ నిల్వలు తక్కువగా ఉండటంతో నిరాశతో వెనుదిరిగారు. అక్కడక్కడ ఆరోగ్య సిబ్బందితో ఘర్షణ పడ్డారు. పలుచోట్ల శనివారం రెండో డోసు కూడా నిలిపివేశారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం 11 గంటల తర్వాతగానీ టీకాలు వేయడం ప్రారంభం కాలేదు. గంటల తరబడి ఎండలో నిలబడి జనం తల్లడిల్లిపోయారు. పలుచోట్ల తెల్లవారకముందే ఉదయం 5-6 గంటలకే వచ్చి క్యూకట్టారు. ఒక్కో కేంద్రానికి 200 మంది వరకు చేరుకున్నారు. గతంలో కేంద్రానికి 100 చొప్పున టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే లభ్యత తక్కువగా ఉండటంతో కొన్ని కేంద్రాల్లో 40-50తో సరిపెట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి పడిగాపులు పడినా వ్యాక్సిన్ లభించని వారు సిబ్బందితో గొడవలకు దిగారు.
పరిమిత సంఖ్యలో టోకెన్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లు తక్కువగా వస్తుండటంతో టోకెన్లు పరిమిత సంఖ్యలో ఇచ్చారు. టోకెన్లు అయిపోయాయని చెప్పినా కేంద్రాల దగ్గర ప్రజలు గంటలతరబడి పడిగాపులు కాశారు. తొలిడోసు కోసం స్లాట్లు బుక్ చేసుకున్నవారిలో కొందరు టీకా కేంద్రాలకు వచ్చారు. సమాచారం లేక కొందరు, ఆలస్యంగానైనా సరే వేస్తారేమోనన్న ఆశతో మరికొందరు వచ్చారు. లభ్యతను బట్టి.. ఒక్కో కేంద్రంలో సగటున 50-100 మందికి టోకెన్లు జారీ చేసి టీకాలు ఇచ్చి పంపించారు. వరుసలో మిగిలిన వారికి తదుపరి రోజుకోసం టోకెన్లు ఇచ్చారు.
* ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సిన ప్రజలు దాదాపు 13 లక్షల వరకు ఉంటారని అంచనా. వారికోసమని ఈనెల 15 వరకు తొలిడోసు టీకాల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. అర్హులైన వారందరికీ రెండోడోసు ఇచ్చిన తరువాతే.. తొలిడోసు వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలి, రెండోడోసుకోసం కొవిన్ యాప్‌లో తీసుకున్న అపాయింట్‌మెంట్లు రద్దుచేసింది. శనివారం నుంచి వాకిన్ పద్ధతిలో(నేరుగా కేంద్రాలకు వెళ్తే) టీకాలు ఇస్తామని అధికారులు సూచించారు.
గేటు తెరవగానే నాలుగువందల మంది..
తొలి డోసుగా కొవాగ్జిన్ తీసుకుని 4 వారాలు, కొవిషీల్డ్ వేయించుకుని 6 వారాలు గడిస్తే శనివారం నుంచి రెండో డోసుకు అర్హులని వైద్యశాఖ చెప్పడంతో ఈ మేరకు గడువు దాటినవారు వ్యాక్సిన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి ఉదయం గేటు తెరవగానే ఒకేసారి నాలుగువందల మంది వచ్చారు. వారందరికీ టోకెన్లు ఇచ్చారు. మరో రెండువందల మంది రావడం.. గంటల తరబడి అక్కడే ఉండటంతో మధ్యాహ్నం మళ్లీ టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్లు వేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 56 మందికి వేశారు. నల్గొండ జిల్లాలో 31 మండలాలల్లోని 43 కేంద్రాల్లో 3,600 మందికి రెండో డోసు వేశారు.
పట్టించుకునేవారేరి!