తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏమ'నాలా' ?.. అదే ముంపు.. అదే ముప్పు..!

వానాకాలం వచ్చిందంటేనే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జనం వణికిపోతున్నారు. జలవనరులు, నాలాల సమీప ప్రాంతాల్లోని వందల కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద నీటి కాలువలు సక్రమంగా లేకపోవడం.. నాలాల్లోనే వాననీరు వచ్చి చేరడం, ఆక్రమణలు, అసంపూర్తి పనులు వెరసి ముంపు కష్టాలు రెట్టింపవుతున్నాయి.

అదే ముంపు.. అదే ముప్పు
అదే ముంపు.. అదే ముప్పు

By

Published : Aug 1, 2022, 4:12 AM IST

వానాకాలం వచ్చిందంటేనే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జనం వణికిపోతున్నారు. జలవనరులు, నాలాల సమీప ప్రాంతాల్లోని వందల కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద నీటి కాలువలు సక్రమంగా లేకపోవడం.. నాలాల్లోనే వాననీరు వచ్చి చేరడం, ఆక్రమణలు, అసంపూర్తి పనులు వెరసి ముంపు కష్టాలు రెట్టింపవుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ సహా రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏటా ఈ పరిస్థితి షరా మామూలుగా మారిపోతోంది. తక్షణ చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షం వచ్చిందంటే అంతే..

  • హైదరాబాద్‌ నగరంలో నాలాల విస్తరణ నెమ్మదిగా సాగుతుండటంతో కేశవగిరి, గోల్కొండ, హయత్‌నగర్‌, పహాడీషరీఫ్‌, అంబర్‌పేట, బండ్లగూడ సహా వందల కాలనీలు ముంపుతో ఇబ్బంది పడుతున్నాయి.
  • వరంగల్‌లో సుమారు 45 కాలనీలు ముంపు సమస్యతో సతమతమవుతున్నాయి. చర్యలకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టినా అరకొరగానే ఉన్నాయి. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. నాలాలు విస్తరించినా రక్షణ గోడలు కట్టకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది.
  • కరీంనగర్‌లో శ్రీహరినగర్‌, రాంనగర్‌ సహా ప్రధాన రహదారి ప్రాంతంలో ముంపు సమస్య షరా మామూలుగా మారింది. తాత్కాలిక కాలువలు తవ్వితే తప్ప నీరు వెళ్లే మార్గంలేదు. నగరపాలక పరిధిలో రూ.132 కోట్లతో వరద కాల్వల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ పనులు కొన్ని చోట్ల పూర్తి కాలేదు. దాంతో అలకాపురి, సంతోష్‌నగర్‌, శ్రీహరినగర్‌ ప్రాంతాలతోపాటు ఆర్టీసీ వర్క్‌షాప్‌ వైపు రోడ్డుపై వరద ప్రవహించింది. కట్టరాంపూర్‌లో స్మార్ట్‌ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా వదిలేయడంతో పలు ఇళ్ల లోకి నీరు వచ్చింది.
  • నిజామాబాద్‌లో 15 కాలనీలు వరదనీటితో ఇబ్బందిపడుతున్నాయి. మురుగు కాలువలు సక్రమంగా లేక, అక్రమ నిర్మాణాల వల్ల ముంపు తప్పడంలేదు.
  • నల్గొండలో వరద కాలువలను నిర్మించకపోవడంతో పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. ప్రధానంగా చైతన్యపురి, సూర్యవంశీ కాలనీ, హిమగిరి కాలనీ, ఎన్టీఆర్‌ నగర్‌, రాఘవేంద్రకాలనీ, హనుమాన్‌ నగర్‌ వాసులు బాధితులుగా మారుతున్నారు.
  • మహబూబ్‌నగర్‌లో పెద్ద చెరువు కింద ఉన్న రెండు నాలాలను ఆక్రమించి ఇళ్లను నిర్మించడంతో ముంపు సమస్య తీవ్రంగా ఉంది. బీకేరెడ్డి కాలనీ, శేషాద్రినగర్‌, శివశక్తి నగర్‌, రామయ్యబౌలి, మేకలబండ, మధురానగర్‌లకు ఇక్కట్లు తప్పడం లేదు.

ఏ కాలనీ చూసినా..

  • జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఎనిమిది కాలనీలు ముంపు గుప్పిట్లో ఉన్నాయి. ప్రధాన మురుగు కాలువలు, పెద్ద నాలాల నిర్మాణం జరగకపోవడంతో ఏటా సమస్య ఎదురవుతోంది.
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, భైంసా, నిర్మల్‌ పట్టణాల్లో ముంపు సమస్య తీవ్రంగా ఉంది. నిర్మల్‌లో రెండు కాలనీలు ముంపుతో ఇబ్బంది పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణవాగు సమీపంలో లేఅవుట్‌లు వేయడంతో ఆ కాలనీలు వరదలో చిక్కుతున్నాయి. పల్లెచెరువు కింద పేదలకు స్థలాలు కేటాయించడంతో ఏటా వర్షాకాలంలో అక్కడివారిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. మంచిర్యాలలో గోదావరి, రాళ్లవాగు ప్రాంతంలోని 5 కాలనీలు ముంపును ఎదుర్కొంటున్నాయి.
  • కామారెడ్డిలో సుమారు పది కాలనీలు ముంపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ ఏళ్ల నాటి కాలువలను విస్తరించకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. అయ్యప్పనగర్‌, వాసవీనగర్‌, ఉపాధ్యాయకాలనీ సహా ఇతర ప్రాంతాల్లో సమస్య ఉంది.
  • మిర్యాలగూడలో భారీవర్షాల వేళ బంగారుగడ్డ, సీతారాంపురం, సుందర్‌నగర్‌లకు వరద తప్పడంలేదు.
  • జనగామలో ఇష్టారాజ్యంగా కాలువల నిర్మాణంతో జనం ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
  • కొత్తగూడెంలో అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ పుణ్యమా అని పలు కాలనీలు ముంపులో చిక్కుకుంటున్నాయి. రామవరం, ఎస్పీబీ నగర్‌లు ఏటా జలమయమవుతున్నాయి. పురపాలకశాఖ, గ్రామ పంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడంతో భారీ డ్రైనేజీల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
  • సూర్యాపేటలో శివారు కాలనీలకు మురుగునీటి కాలువలు లేక వర్షాకాలంలో ముంపు తప్పడం లేదు.
  • సంగారెడ్డిలో రూ.15 లక్షలతో బొబ్బికుంట పూడిక తీసేందుకు పలుమార్లు శంకుస్థాపన చేశారు. నామమాత్రంగా పనులు చేసి వదిలేశారు. రిక్షా కాలనీ, మఖ్దూంనగర్‌ సహా పలు కాలనీలకు నీరు చేరుతోంది. కలెక్టరేట్‌ ముందున్న కాలనీలు చెరువు నిండిన ప్రతిసారీ ఇబ్బంది పడుతున్నాయి.
  • భూపాలపల్లిలో మురుగునీటి కాలువలు వెడల్పుగా లేకపోవడం, పలు చోట్ల కబ్జాకు గురికావడంతో వాననీరు ఇళ్లలోకి చేరుతోంది. ప్రధానంగా రాజీవ్‌నగర్‌, సీఆర్‌ నగర్‌ కాలనీలకు సమస్య ఏర్పడుతోంది. వరద కాలువలు కబ్జాకు గురయ్యాయి.
  • పెద్లపల్లిలో బండారికుంట ఆక్రమణలపాలు కావడంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తుతోంది.
  • రామగుండంలో వరద కాలువలు సక్రమంగా లేకపోవడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని కాలనీలు తీవ్రమైన ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి.

పనులు ప్రతిపాదనలకే పరిమితం: వరంగల్‌ నగరంలోని ఎన్టీఆర్‌ కాలనీ ఇది. భారీ వర్షాలు ఎప్పుడొచ్చినా ముంపునకు గురయ్యే మొదటి కాలనీల్లో ఇదొకటి. ఇంకా ఇక్కడి సాయినగర్‌, సంతోష్‌నగర్‌ కాలనీలూ 15 ఏళ్లుగా ముంపు సమస్యతో సతమతమవుతున్నాయి. భద్రకాళి చెరువు సమీపంలో బొందివాగు నాలా పక్కన ఉన్న ఈ ప్రాంతంలోని కుటుంబాలకు చినుకు పడితే వణుకే. బొందివాగు నాలా నీళ్లను భద్రకాళి చెరువులోకి మళ్లిస్తే ముంపు సమస్య తప్పుతుంది. నాలా మళ్లింపు, విస్తరణ తదితరాల కోసం రూ.143 కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించారు. కానీ, అవిప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details