- హైదరాబాద్‌లోని ఓ వైద్యుడు 8 నెలల క్రితం కరోనా టీకా తీసుకున్నారు. ఇటీవల ఆయనలో దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు కనిపించాయి. వైరల్ జ్వరంగా భావించి మందులు వేసుకున్నారు. వారం అయినా జ్వరం తగ్గకపోగా ఆక్సిజన్ స్థాయులు పడిపోయాయి. వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఐసీయూలో పది రోజులపాటు 20 లీటర్ల ఆక్సిజన్ అందించడంతో కోలుకున్నారు.
- ప్రైవేటు ఉద్యోగి నరేశ్ గత అయిదారు రోజుల నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ అని భావించి, కరోనా పరీక్ష చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. సొంత వైద్యంతో నెట్టుకొచ్చారు. వారం దాటినా జ్వరం, దగ్గు తగ్గలేదు. ఇతర ఇబ్బందులూ తలెత్తడంతో వైద్యుణ్ని సంప్రదించి, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు. పాజిటివ్ వచ్చింది. 15 రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం నయమైంది.
కరోనా(Covid) తగ్గుముఖం పట్టిందని కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మాస్కు, శానిటైజర్ వాడకం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలకు గాలికి వదిలేస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటివి సోకితే.. సీజనల్ వ్యాధులని భావించి సొంత వైద్యం చేసుకుంటున్నారు. పరిస్థితి తీవ్రమైనప్పుడు పరీక్ష చేయిస్తే కొవిడ్ పాజిటివ్‌గా(Corona tests) తేలుతోంది. అప్పటికే శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి పరిస్థితి విషమంగా మారుతోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో రోజూ పది మంది వరకు తీవ్ర కరోనా లక్షణాలతో చేరుతున్నారు. నిజానికి కొవిడ్ కేసుల సంఖ్య ఇటీవల బాగా తగ్గిపోయినా కొందరు టీకా తీసుకోకపోవడం, లక్షణాలు కనిపించినా ఆఖరి వరకు పరీక్షలకు దూరంగా ఉండటంతోనే వారిలో వైరస్ తీవ్రత పెరుగుతోందని అంటున్నారు వైద్యులు. మరికొందరు పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అంతటితో ఆగిపోతున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఆక్సిజన్ శాతం పడిపోయి ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు, ఆపైబడిన వారికే వ్యాక్సిన్ వేస్తున్నారు. పాఠశాలలు తెరచుకోవడంతో పిల్లలు బడులకు వెళుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చూడ చూడ తేడాలు వేరు..
- సాధారణ వైరల్ ఫీవర్, కొవిడ్ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. తరచి చూస్తే తేడాలు కనిపిస్తాయి.
- వైరల్ ఇన్‌ఫెక్షన్‌లో జ్వరంతోపాటు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. 3-5 రోజుల్లో తగ్గిపోతాయి.
- కరోనాలో ఇవే లక్షణాలతోపాటు ఆయాసం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం కనిపిస్తాయి.
- కొందరికి రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గినా బయటకు ఎలాంటి లక్షణాలు ఉండవు. ఇదే కొన్నిసార్లు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది.
- అందుకే కొవిడ్ లక్షణాలు కనిపిస్తే తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పరీక్షలకు వెనకడుగు వద్దు
"కరోనా లక్షణాలున్నా కొందరు పరీక్షలకు వెనకడుగు వేస్తున్నారు. సాధారణ వైరల్ జ్వరమైతే 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకా జ్వరం, ఆయాసం, దగ్గు కొనసాగుతుంటే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి."