Pedavegi SI Suspended: ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా పెదవేగి ఎస్సై సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. మండలంలోని వేగివాడలోని ఆత్మహత్య చేసుకున్న తల్లీకుమార్తెల కేసులో అలసత్వం వహించారని మృతుల బంధువులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సత్యనారాయణ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. దీనిపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఎస్సై సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే..:‘ఈ ఘటనపై పెదవేగి పోలీసులకు ఈ నెల 13న ఫిర్యాదు చేశాం. తరువాత మాట్లాడదామని ఎస్సై సత్యనారాయణ చెప్పారు. అప్పటినుంచి చిట్టిబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. బాలిక చనిపోయాక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని.. ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వారు బలయ్యారని విమర్శించారు. వారు ఫిర్యాదు చేసింది వాస్తవమేనని.. తాము కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారని ఎస్సై సత్యనారాయణ వివరణ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే: వేగివాడకు చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులకు వెళ్లే యువకుడు కాట్రు చిట్టిబాబు పరిచయమయ్యాడు. అతడు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై ఏలూరుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు తీశాడు. విషయం బయటకు చెబితే ఫొటోలను గ్రామంలోని యువకులకు చూపిస్తానని బెదిరించాడు.