Hyderabad Drugs Case: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ మింట్ పబ్‌లో డ్రగ్స్ దొరకటం.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలవరపెడుతోంది. దాడి సమయంలో.. కొందరు సెలబ్రెటీలు, విదేశీయులతో పాటు రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే.. సదరు పబ్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీకుమార్ యాదవ్ చిన్నకుమారుడు అరవింద్ కూడా వెళ్లినట్టు సమాచారం బయటికి రావటంతో.. ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై స్పందించిన అంజనీ కుమార్ యాదవ్, ఆయన పెద్ద కుమారుడు అనిల్ కుమార్ యాదవ్.. స్పష్టతనిచ్చారు.
నా కొడుకు పబ్‌కు వెళ్లాడు కానీ..
తన చిన్న కుమారునిపై వస్తున్న వార్తలను అంజనీకుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. తన చిన్నకుమారుడు పబ్‌కు వెళ్లిన విషయం వాస్తవమేనన్న అంజనీకుమార్.. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవటం తప్పా అని ప్రశ్నించారు.
"నా కొడుకు ఒక్కడే పబ్‌కు పోలేదు. పార్టీ ఉంటే స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇది తప్పా. అతనేమైనా డ్రగ్స్ దుకాణానికి పోయిండా.. పబ్‌కే కదా..? పబ్‌కు వెళ్లటం తప్పయితే.. మరి ప్రభుత్వం ఎందుకు ఇష్టానుసారంగా నడిపేందుకు అనుమతులిస్తోంది. పబ్‌కు వెళ్లినంత మాత్రాన డ్రగ్స్ కేసు అంటగడతారా..? డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న మాపై బురద జల్లేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మా కుటుంబాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో విదేశీయులు డ్రగ్స్ తీసుకుంటే అందరినీ అందులోకి లాగటం కరెక్ట్ కాదు. పబ్‌లే లేకపోతే.. ఎవ్వరూ పోకుండా ఉంటారు కదా..? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పబ్‌లను బంద్ చేయాలని నా డిమాండ్."