ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నట్టు చెబుతున్న భాజపా... ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విచారణ జరిపించడం లేదని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిలదీశారు. అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు డేగ కన్ను వేయడం ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారం పోయాక బయట పడుతుందనడంలో అర్థం లేదన్న నారాయణ రెడ్డి... నాన్చుడు ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని... ఓ సంస్థపై ఐటీ దాడులు చేసినట్టు చెబుతున్న భాజపా సమగ్ర దర్యాప్తు చేయించేందుకు ఎందుకు వెనకడుగు వెస్తోందన్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిపై రెండోసారి సీబీఐ దాడులు చేయించిన కేంద్రం... ఇక్కడ ఎందుకు క్షమిస్తున్నారని నిలదీశారు.