తెలంగాణ

telangana

ETV Bharat / city

మే 6, 7 తేదీల్లో రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన - కాంగ్రెస్ పార్టీ తాజా సమాచారం

Rahul Gandhi Telangana Tour: రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్​గాంధీ పర్యటన ఖరారైనట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తెలిపారు. మే 6న హనుమకొండలో నిర్వహించే బహిరంగ సభ, మే 7న హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో భేటీలో పాల్గొంటారని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

Revanth reddy
Revanth reddy

By

Published : Apr 17, 2022, 9:06 AM IST

Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మే 6న హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొంటారన్నారు. ఈ సభకు ‘రైతు సంఘర్షణ సభ’గా పేరు పెట్టినట్లు చెప్పారు. 7న హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశంలో రాహుల్‌ పాల్గొంటారన్నారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో ముఖ్య నేతలు, డీసీసీలతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, ఎంపీ ఉత్తమ్‌, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాహుల్‌ సభకు 5 లక్షల మందిని సమీకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జనసమీకరణపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ఠాగూర్‌ సూచించారు. అనంతరం రేవంత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మనం ఇచ్చిన తెలంగాణను మనమే కాపాడుకోవాలన్న సంకల్పంతో రాహుల్‌ వస్తున్నారు’ అని చెప్పారు.

వరి వేయని రైతులకు పరిహారమివ్వాలి..

‘యాసంగిలో వరి వేయొద్దని కేసీఆర్‌ చేసిన హెచ్చరికతో దాదాపు 20లక్షల ఎకరాల్లో ఈపంట సాగు తగ్గింది. వరి వేయనివారందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో తక్కువ ధరకు విక్రయించిన రైతులకు రూ.క్వింటాకు రూ.600 బోనస్‌ ప్రకటించాలి’’ అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సిన 8.34 లక్షల క్వింటాళ్ల బియ్యం మాయమైన ఘటనపై సీబీఐ విచారణ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన డిమాండ్‌ చేశారు. అంతకుముందు సమావేశంలో.. జిల్లాకు ఒక అధ్యక్షుడి స్థానంలో 3, 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక అధ్యక్షుడిని నియమించాలనే ప్రతిపాదనను ఠాగూర్‌ తీసుకురాగా.. నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశానికి ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు.

మంత్రి పువ్వాడ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి..

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ అరాచకాలు పెట్రేగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'కేంద్రం నిధులిస్తుంటే ఫొటోలు, పేర్లు మార్చి తెరాస ప్రజలను ఏమార్చుతోంది'

ABOUT THE AUTHOR

...view details