తెలంగాణ

telangana

ETV Bharat / city

మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయాలని గవర్నర్‌కు ఉత్తమ్ లేఖ - telangana varthalu

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నందున మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయాలని గవర్నర్‌ను పీసీసీ చీఫ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసైకి లేఖ రాశారు. ఉత్తమ్‌కు ఫోన్ చేసి తమిళిసై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎస్​ఈసీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

uttamkumar reddy letter to the Governor
మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయాలని గవర్నర్‌కు ఉత్తమ్ లేఖ

By

Published : Apr 23, 2021, 5:41 PM IST

రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో మినీ పురఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందంటూ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తలొగ్గుతున్నట్లు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు. పుర ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్​ఈసీ అనాలోచిత నిర్ణయాలు, పక్షపాత ధోరణిని గవర్నర్‌ గమనించాలని ఆయన కోరారు.

రెండు మున్సిపల్​ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికలను కొనసాగించడం రాష్ట్ర ఎన్నికల సంఘం అనాలోచిత నిర్ణయానికి పరాకాష్ఠగా ఉత్తమ్‌ పేర్కొన్నారు. ఎస్​ఈసీ స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు ముందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే పద్ధతిని మరిచిందని ఆరోపించారు. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుండగా ఈ నెల 15న మినీ పుర ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు తెరాసకు ప్రతికూల ఫలితం ఉండే అవకాశం ఉందని భావించి ఆ ప్రభావం పుర ఎన్నికల ఓటర్లపై పడకుండా రాజకీయ ఆదేశాలను ఎస్‌ఈసీ అనుసరించిందని ఆరోపించారు.

కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును రాష్ట్ర హైకోర్టు కూడా తప్పుబట్టిందని లేఖలో పేర్కొన్నారు. కరోనాను సాకుగా చూపి పేదల నుంచి లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రులు గుంజుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత నిర్వహించేట్లు జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తనకు ఫోన్ చేసి గవర్నర్​ తమిళిసై వివరాలు అడిగి తెలుసుకున్నారని... ఎన్నికలకు సంబంధించి ఎస్​ఈసీతో మాట్లాడతానని హామీ ఇచ్చారని ఉత్తమ్​ తెలిపారు.

ఇదీ చదవండి: ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారు : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details