తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాసను ఓడించి కేసీఆర్​కు ఝలక్ ఇద్దాం : ఉత్తమ్​

తెరాస ఆరేళ్ల పాలనలో... మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చేసిందేమీ లేదని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏం ఉద్ధరించారని ఓటు అడుగబోతున్నారని ప్రశ్నించారు. తెరాస కుట్రలను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.

uttam kumar reddy
uttam kumar reddy

By

Published : Jan 10, 2020, 5:54 PM IST

పురపాలక ఎన్నికల్లో తెరాస కుట్రను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంతా సైనికుల్లా పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల సంఘం ద్వారా షెడ్యూలు విడుదల చేయించిందని ఆరోపించారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌ నుంచి ఫేస్​బుక్​ లైవ్​ ద్వారా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నేతలకు మున్సిపల్‌ ఎన్నికల్లో ఏవిధంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు.

ఏం చేశారని ఓటు అడుగుతారు

పార్టీ పరంగా తాము లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెరాస ఆరేళ్ల పాలనలో... మున్సిపాలిటీలకు కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలు... కార్పొరేషన్లలో ఏం ఉద్ధరించారని ఓటు అడుగబోతున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న తెరాస ఎవరికైనా ఇచ్చారా అని నిలదీశారు.

తెరాసకు ఝలక్​ ఇద్దాం

ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదని... రెండో పంటకు రైతుబంధు ఇవ్వలేదని ఉత్తమ్​ విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్‌కు.. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను ఓడించి ఝలక్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్లరద్దు, ముమ్మారు తలాక్, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇచ్చిన తెరాసకు ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్లేనని ఆరోపించారు.

తెరాసను ఓడించి కేసీఆర్​కు ఝలక్ ఇద్దాం : ఉత్తమ్​

ఇదీ చూడండి: బస్తీమే సవాల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ గురి

ABOUT THE AUTHOR

...view details