తెలంగాణ

telangana

ETV Bharat / city

Revanth Reddy On English Medium: 'ఉపాధ్యాయులే లేనప్పుడు ఆంగ్ల మాధ్యమం ఎలా '

Revanth Reddy On English Medium : అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామన్న అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ఉపాధ్యాయులే లేనప్పుడు ఆంగ్లమాధ్యమంలో చదువును ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్​ను ముఖ్యమంత్రి ఎందుకు వేయడం లేదని నిలదీశారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Jan 18, 2022, 4:46 PM IST

Revanth Reddy On English Medium: నిరుపేదలకు విద్యను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. అది అమలు చేస్తే.. పేదలంతా బాగుపడుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామన్న అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఎందుకంటే అవి ఆదాయ వనరులు

సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఉపాధ్యాయులే లేనప్పుడు ఆంగ్లమాధ్యమంలో చదువును ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్​ను ముఖ్యమంత్రి ఎందుకు వేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమకాలను చేపట్టారని విమర్శించారు. పాఠశాలలో కరోనాతో వచ్చే మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదని.. అయినా వాటిని మూసివేశారన్నారు. పబ్​ల వల్ల మరణాలు సంభవిస్తున్నా.. వాటిని నియంత్రించడం లేదని.. ఎందుకంటే అవి ఆదాయ వనరులు కావడంవల్లనే అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా సీఎం కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేశారని.. అలా చేసి గొర్లు, బర్లు, చేపలు ఇస్తున్నారని రేవంత్​ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల భర్తీ లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదన్నారు.

చిన జీయర్​ స్వామి అవమానిస్తున్నారా?

ముచ్చింతల్​లో స‌మ‌తామూర్తి విగ్రహావిష్కర‌ణ‌ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి, ప్రధాని, కేంద్రమంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చిన‌జీయ‌ర్ స్వామి ఆహ్వానిస్తున్నారని... కానీ ఎంపీ అయిన తనను మాత్రం ఆహ్వానించకపోవడం వెనక ఉన్న ఆంతర్యమేంటని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. తాము శైవులం కాబట్టే... వైష్ణవులు తనను అవమానిస్తున్నారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ మాత్రం సమానత కనిపించడం లేదన్నారు.

అది ఎంఐఎంకి మిత్రద్రోహం కాదా?

చినజీయర్ స్వామి దగ్గర రియల్​ ఎస్టేట్ వ్యక్తులు ఉండడం ఆయన గౌరవానికి సరైంది కాదని రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆస్తులను పెంచడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​లో ఎస్పీకి మద్దతుగా తెరాస ప్రచారం చేస్తే అక్కడ పోటీచేస్తున్న ఎంఐఎంకి మిత్రద్రోహం చేసినట్లు కాదా అని అన్నారు. తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని యూపీలో ఎంఐఎంకి కాకుండా ఎస్పీకి ఎలా ప్రచారం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు..

ABOUT THE AUTHOR

...view details