తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​కు కోపం వస్తుందనే ఉగాది వేడుకలకు కిషన్​ రెడ్డి, బండి సంజయ్ వెళ్లలేదు' - రేవంత్ రెడ్డి వార్తలు

గవర్నర్‌ దిల్లీ పర్యటనతో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి అన్నారు. కుటుంబ సమస్యల నుంచి తప్పించుకోడానికి కేసీఆర్‌ గవర్నర్‌ను సాకుగా చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్​కు లేని అధికారులు తెలంగాణ గవర్నర్​కు ఉన్నాయని చెప్పారు.

Revanth reddy
Revanth reddy

By

Published : Apr 8, 2022, 7:19 PM IST

కుటుంబంలో ఉన్న సమస్యలను తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్... గవర్నర్‌ అంశాన్ని సాకుగా చూపుతున్నారని తమిళిసై సౌందరరాజన్​ అన్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. సీఎం చేయాలంటూ కేసీఆర్​పై కేటీఆర్​ ఒత్తిడి తెస్తున్నారన్న రేవంత్‌.... గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు అది సాధ్యంకాదని కుటుంబసభ్యులతో చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని గవర్నర్‌ నివేదిక ఇచ్చారని... వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకోవాలని రేవంత్‌ సూచించారు. గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ అధికారికంగా నివేదిక ఇచ్చారు. వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఆమె ఉపయోగించుకోవాలి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని సమస్యలను గవర్నర్ గుర్తించి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్‌కు ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయి.' - ఇష్టాగోష్టిలో రేవంత్​ రెడ్డి

గవర్నర్​ భాజపా నేతలా మాట్లాడుతున్నారని తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వాళ్లు భాజపా నేతలని తెలియదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు హైదరాబాద్‌లో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరు కాలేదని ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని మోదీ, అమిత్‌ షాలకు ఫిర్యాదు చేయాల్సిందని అన్నారు. అప్పుడే ఇక్కడి కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతం అయ్యేవని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశం:కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన రాష్ట్రంలో జరిగేలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనా...కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా భాజపా, తెరాసలు ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తున్నట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీల రాజకీయ నాటకాలను బయటపెడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లేట్లు పోరాటాలు కొనసాగించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ నెలాఖరున రాష్ట్రంలో అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై

గవర్నర్​ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్​.. ఏమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details