Revanth Reddy on Paddy Procurement : తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే రైతులు... మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన లేఖ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇక ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా..? అని నిలదీశారు.
ఇప్పుడు...ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే... ఆ రెండు పార్టీల మోసాలను రైతులు గ్రహించలేరా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7,500 కోట్లు నష్టం వచ్చినట్లు పేర్కొని ప్రభుత్వం...ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా అని నిలదీశారు.