Revanth Reddy on KCR: ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుతిన్, కిమ్, జిన్‌పింగ్ లాంటి నిరంకుశులే ఆదర్శమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన 48 గంటల నిరసన దీక్ష ముగింపు సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం పరిఢవిల్లడానికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని రేవంత్ పేర్కొన్నారు. భారత రాజ్యంగం స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలిసింది కానీ.. కేసీఆర్‌కు తెలియలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలను అంత సులువుగా తీసుకోవడానికి లేదని.. దీని వెనక భాజపా, మోదీ కుట్ర ఉందని ఆరోపించారు.
రేపు కేసీఆర్‌పై ఫిర్యాదు..
"రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదు. కేసీఆర్ వ్యాఖ్యల వెనక భాజపా, మోదీ హస్తముంది. చైనా శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు జిన్‌పింగ్ రాజ్యాంగాన్నే మార్చేశారు. కేసీఆర్, మోదీ కూడా జిన్‌పింగ్ తరహా ఆలోచనే చేస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి తెలిసింది.. కానీ కేసీఆర్‌కు తెలియలేదు. పదవుల కోసం తెరాస నేతలు కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. రాజ్యాంగం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా..? రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ ఏర్పడింది. రేపు రాష్ట్రంలోని అన్ని పీఎస్‌లలో కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తాం. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తాం. కేసీఆర్ వ్యాఖ్యలపై సోమవారం రోజు పార్లమెంట్‌లో నిరసన తెలుపుతాం." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు