తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2021, 6:46 AM IST

ETV Bharat / city

తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు

రాష్ట్రంలో లక్షా 91వేల 126 ఉద్యోగ ఖాళీలున్నాయని వేతన సవరణ సంఘం నివేదికలో వెల్లడైంది. తెలంగాణలో ఉన్న 32 శాఖల్లో ఐదు శాఖల్లో మాత్రమే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపింది. జనాభా, మంజూరు పోస్టుల పరంగా చూస్తే నిష్పత్తి 1:40 మాత్రమే ఉందని నివేదికలో పేర్కొంది.

.91 lakh government jobs are vacant in telangana
తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయని రాష్ట్ర వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) తన నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులకుగాను ప్రస్తుతం 3,00,178 (61%) మందే పనిచేస్తున్నారు. అంటే మొత్తం పోస్టుల్లో 39 శాతం ఖాళీలే. రాష్ట్రంలో ప్రతి వేయి మందికి 8.5 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జనాభా 3.52 కోట్లు కాగా మంజూరైన పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి వేయి మంది జనాభాకు 14 మంది ఉద్యోగులుండాలి. ఖాళీల దృష్ట్యా 8.5 మంది మాత్రమే ఉన్నారు. జనాభా, మంజూరు పోస్టుల పరంగా చూస్తే నిష్పత్తి 1:40 శాతం మాత్రమే ఉంది.

ఆ ఐదు శాఖల్లో అత్యధికం

రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలుండగా ఐదు శాఖల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖలో 1,37,851 మంజూరీ పోస్టులకు 1,13,853 మంది పనిచేస్తున్నారు. హోంశాఖలో మొత్తం 98,394 మంజూరీ పోస్టులకు 61,212 మంది పనిచేస్తున్నారు. వైద్యఆరోగ్య శాఖలో 52,906 పోస్టులు మంజూరు కాగా అందులో 22,336 మంది ఉన్నారు. రెవెన్యూ శాఖలో 27786లో 19,825, పంచాయతీరాజ్‌ శాఖలో 26201కి గాను 13573 మంది మాత్రమే ఉన్నారు. ఇలా మొత్తం అయిదు శాఖల్లోనే రాష్ట్రంలోని 3,42,938 (69.80%) మంజూరీ పోస్టులున్నాయి. పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2,30,799 (76.88%) మంది వీటిల్లోనే ఉన్నారు.

ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు

ఖాళీలు భర్తీ కాకపోవటంతో ప్రభుత్వ శాఖల్లో 50,400 మంది ఒప్పంద, 58,128 మంది పొరుగు సేవల ఉద్యోగులు(16.81%) పనిచేస్తున్నారు.

సమస్యలు

ఉద్యోగ ఖాళీల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు, ఉద్యోగులు వాపోతున్నారు. ఖాళీల వల్ల తమపై పనిభారం పడుతోందని, ప్రజలకు సరైన సేవలందించలేకపోతున్నామని, వసతి, రవాణా వ్యయాలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు, ఇతర పరిపాలన విభాగాలు ఏర్పాటుచేసినా వాటిల్లో ఖాళీల వల్ల ఇక్కట్లు తప్పడం లేదు. వీటన్నింటిని పరిష్కరించాలని పీఆర్‌సీ ప్రభుత్వానికి సూచించింది. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు సరైన శిక్షణ ఇస్తే వారు ప్రజలకు ఉపయోగపడతారని చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details