pawan kalyan: ఏపీలో ప్రజానీకం సమస్యలతో అవస్థలు పడుతున్నారని.. పాలకులకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. విజయవాడ ఎంబీవీ కేంద్రంలో జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంత సహా వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనం తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 427 వినతులు స్వీకరించినట్టు జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదుల సమాచారాన్ని కంప్యూటర్లో నమోదు చేశారు. ఫిర్యాదులు చేసిన వారికి రసీదులు కూడా అందజేశారు.
"నాపై నమ్మకంతో ప్రజలు తరలివచ్చి ఫిర్యాదులు ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో.. నేను బలమైన గొంతుకనవుతా. సమస్యలను సంబంధిత శాఖలకు తెలియజేసి పరిష్కరించే ప్రయత్నిస్తా. రైతుల నుంచి ఎక్కువగా సమస్యలు వచ్చాయి. పంటలకు గిట్టబాటు ధరలు లేకపోవడం మొదలు రైతులు చాలా సమస్యలు చెప్పారు. టిడ్కో ఇళ్లు మంజూరు చేయాలని ఎక్కువ మంది కోరారు. విద్యార్థులు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాను విద్యార్థులకు మామయ్యగా వైఎస్ జగన్ చెప్పుకున్నారు. కానీ.. ఈ ముద్దుల మామయ్య విదేశాల్లో తిరుగుతున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించడం లేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది"
-పవన్ కల్యాణ్, జనసేన అధినేత
అన్యాయాన్ని ప్రశ్నిస్తే వేధిస్తున్నారు : రాష్ట్రంలో రోడ్లు లేవని, అక్రమ మైనింగ్ జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా గురజాలలో సీఎంకు చెందిన సరస్వతి పవర్ ఫ్యాక్టరీకి 300 ఎకరాల భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని కొెదరు ఫిర్యాదు చేశారు. నోరు తెరిచి అన్యాయం జరిగిందని చెబితే చాలు పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేస్తూ వేధిస్తున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాలు దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కృష్ణా జిల్లాలో పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ పెరుగుతోంది. గుక్కెడు మంచినీరు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లక్షల కోట్లు ఎలా దోచుకోవాలి..? రాజధాని ఎలా తరలించాలి? అనే ఆలోచనలోనే వైకాపా నేతలు ఉన్నారు. విజయవాడ మొత్తం కాలుష్యమయమైంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతున్నా.. జలాలు కలుషితమవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో లో 5 నుంచి 9 అడుగులు తవ్వితే చాలు మురుగునీరు వస్తోంది.