తెలంగాణ

telangana

ETV Bharat / city

PAWAN KALYAN: 'దసరా తర్వాత రోడ్డెక్కుతా.. అప్పుడు మీకు ఉంటది'

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. కౌలురైతు భరోసా యాత్రలో భాగంగా.. ఆత్మహత్య చేసుకున్న 80 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో.. వైకాపా పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

By

Published : Jun 19, 2022, 8:13 PM IST

Updated : Jun 19, 2022, 8:31 PM IST

PAWAN KALYAN: జనసేనకు ప్రజలతోనే పొత్తు ఉందని.. రాష్ట్రం బాగుకోసం తమను ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. మొత్తం 80 మంది కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అధికార పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు.

ప్రకాశంలో నాయకుల వద్దే డబ్బు : వైకాపా అసమర్థ పాలన వల్ల ప్రకాశం జిల్లా నుంచి వలసలు బాగా పెరిగాయని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల వద్ద మాత్రమే డబ్బు ఉందని, సామాన్య ప్రజలు పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా దుస్థితిని మార్చేందుకు మహిళలు కొంగు బిగించాలి జనసేనాని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ.. ఆంధ్రకు అన్యాయమే జరుగుతోందన్న పవన్.. అయినా అధికార పార్టీ నాయకులు ప్రశ్నించడం లేదని అన్నారు. బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికే పార్లమెంటు, అసెంబ్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. అందుకే బాధ్యత కలిగిన వ్యక్తులను చట్ట సభలకు పంపించాలను కోరారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనుల కోసం.. వైకాపా నేతలు ఎందుకు గట్టిగా అడగరు అని నిలదీశారు.

పార్టీ పెట్టినప్పటి నుంచీ ఇబ్బందులే : జీవితంలో తనకు ఎలాంటి కోరికలూ లేవన్న పవన్.. అన్నింటినీ త్యజించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అయితే.. పార్టీ పెట్టినప్పటి నుంచీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయని అన్నారు. అయినప్పటికీ.. ప్రజలకు అండగా నిలబడతామని ఇచ్చిన మాటకోసం.. వారి వెంటే ఉన్నామని చెప్పారు. తనను దత్తపుత్రుడు అన్న వ్యాఖ్యలపై స్పందించిన పవన్.. తాను ప్రజలకు దత్తపుత్రుడినే అని అన్నారు. మీరు మాత్రం సీబీఐ దత్తపుత్రుడేనని.. కేసులు ఎదుర్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. మన దగ్గర క్రిమినల్‌ కేసులున్న యువతకు ఉద్యోగాలు రావు అన్న పవన్.. క్రిమినల్‌ కేసులుండే నాయకులు మాత్రం ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేసే వారికి నియమ నిబంధనలు వర్తించవా? అని నిలదీశారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏం చేయలేరనే ధీమాతో ఉన్నారని, సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్‌ చేసే విధంగా చట్టం రావాలని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చింది అందుకే : తాను సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదని, సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సొంత జేబులు నింపుకునే వాళ్లను కాకుండా.. బాధ్యత కలిగిన వ్యక్తులను అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. అప్పటి వరకు రాష్ట్రం బాగుపడదని పవనే అన్నారు. ప్రజాప్రతినిధులుగా కొత్త తరం నేతలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

5 లక్షల కోట్ల అప్పు తెచ్చారు: వైకాపా సర్కారు రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, అవి ఏం చేశారని వైకాపా ఎమ్మెల్యేలను అడగండని పిలుపునిచ్చారు. రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారన్న పవన్.. ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో వివరంగా చెప్పట్లేదన్నారు. 2024లో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారని, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని, కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు మాత్రం ఉపయోగించడంలేదని పవన్‌ విమర్శించారు.

ఈసారి అవకాశం ఇవ్వండి : జనసేన అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైకాపా వాళ్లకి ఉన్నప్పుడు.. రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామని చెప్పారు. చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండని కోరారు. రాబోయే ఎన్నికలు కీలకమైనవన్న పవన్.. ఈ సారి ప్రజలు జనసేన వైపు చూడాలని కోరారు. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని.. తమకు ఎవరితోనూ పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రధాని మోదీతోనే విభేదించాని, ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో గొడవ పెట్టుకున్నానని చెప్పారు. ప్రజలు ముందుకెళ్లేందుకు మాత్రమే ఆలోచిస్తానన్న పవన్.. రాబోయే ఎన్నికల్లో తమకు అండగా ఉండి, ఆశీర్వదించాలని కోరారు. దసరా వరకు వైకాపా నేతలు ఏమన్నా పట్టించుకోబోమన్న పవన్.. ప్రజల సమస్యలు వినడానికి దసరా తర్వాత రోడ్డెక్కుతామని, అప్పుడు వాళ్లకు ఉంటుందని అన్నారు.

'దసరా తర్వాత రోడ్డెక్కుతా.. అప్పుడు మీకు ఉంటది'

ఇదీ చదవండి:KTR Letter To Nirmala: వాటిని అమ్మడమంటే.. రాష్ట్రాల హక్కులు హరించడమే: కేటీఆర్

తనయుడితో కలిసి పదో తరగతి పరీక్ష.. తండ్రి పాస్​.. కొడుకు ఫెయిల్​

Last Updated : Jun 19, 2022, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details