PAWAN ON GAS LEAK INCIDENT:ఏపీలోని అచ్యుతాపురం సెజ్‌లోని దుస్తులు తయారుచేసే సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికారగణం నిర్లిప్తతే కారణమని ఆరోపించారు.
ఇదే కంపెనీలో నెలక్రితమే ఇటువంటి ప్రమాదం జరిగి 400 మంది అస్వస్థతకు గురయ్యారని.. మళ్లీ అదే ఘటన పునరావృతమైందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో అటు అధికారులుగానీ.. ఇటు కంపెనీ ప్రతినిధులుగానీ చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని.. ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో.. ఎంతమంది ప్రాణాలను హరించిందో.. ఎప్పటికీ మరచిపోలేమన్నారు.
కాబట్టి.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో పక్కా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించాలని సూచించారు జనసేనాని.