Pawan kalyan tribute to NTR: తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్.టి.రామారావు ఒకరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి.. బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా నిలిచారని ఎన్టీఆర్‌ను కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
తెలుగు భాషపై ఎన్టీఆర్‌కున్న మక్కువ, పట్టు తనను ఎంతగానో ఆకట్టుకునేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపైనా ఎన్.టి.రామారావు తనదైన ముద్రవేశారన్నారు. విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన్ను పలువురు సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా శ్రద్ధాంజలి ఘటించారు.
''మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా'' - జూ.ఎన్టీఆర్