తెలంగాణ

telangana

ETV Bharat / city

pawan Kalyan: తీపిని పంచే వారి జీవితాల్లో చేదు నింపుతారా?.. సర్కారుపై పవన్ సీరియస్ - చెరుకు రైతులపై పవన్ కామెంట్స్

చెరకు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో.. సర్కారు తీరు చేదు నింపిందని అన్నారు. బకాయిలను తక్షణమే ఇప్పించకపోవడం రైతులను వంచించడమేనని జనసేన అధినేత ధ్వజమెత్తారు.

pawan Kalyan
pawan Kalyan

By

Published : Nov 4, 2021, 4:42 PM IST

ఏపీలోని విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరకు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే.. సమస్య జఠిలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రెండేళ్ల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు ఇప్పించకుండా.. సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై జనసేనాని ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ తీరు వల్లే తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోందని అవేదన వ్యక్తం చేశారు. బకాయిలను తక్షణమే ఇప్పించకుండా.. జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామనడం రైతులను వంచించడమేనని విమర్శించారు. ఈ సమస్యపై రైతుల పక్షాన నిలబడాలని జనసేన నాయకులకు ఇప్పటికే సూచించామని పవన్ తెలిపారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే అవకాశం ఉన్నా.. ఆ చట్టాన్ని వినియోగించకపోవడాన్ని జనసేన అధినేత తప్పుపట్టారు.

అసలేం జరిగిందంటే...

బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. గత రెండు సీజన్లకు సంబంధించి కర్మాగారం పరిధిలోని 2400 మంది రైతులకు యాజమాన్యం రూ.16.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో పలు గ్రామాల రైతులు ర్యాలీగా కర్మాగారం ప్రధానద్వారం వద్దకు చేరుకుని ఎదుట నిరసన చేపట్టారు. యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు సమీపంలోని

36వ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పార్వతీపురం-బొబ్బిలి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. రైతుసంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణమూర్తి, మరో అయిదుగుర్ని అరెస్టు చేసి బొబ్బిలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ఆగ్రహించిన రైతులు చేతికి దొరికిన మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో పోలీసులపై దాడికి దిగారు. సీతానగరం ఎస్సై బి.మురళి, మహిళా కానిస్టేబుల్‌ పద్మలకు గాయాలయ్యాయి. వారిని బొబ్బిలి, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించి, అక్కడ మిగిలిన పోలీసులు కర్మాగారంలోకి పరుగులు తీశారు. వర్షం పడుతున్నా రైతులు పరదాలు కప్పుకొని మరీ నిరసన తెలిపారు. సుమారు అయిదు గంటల తర్వాత జేసీ కిశోర్‌కుమార్‌, బొబ్బిలి డీఎస్పీ మోహనరావు రైతు నాయకులతో చర్చించడంతో శాంతించారు. జనవరి 15 లోగా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జేసీ రైతులకు హామీ ఇవ్వగా అందుకు వారు అంగీకరించలేదు. 5న పార్వతీపురం డివిజన్‌లోని మండల కేంద్రాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.


ఇదీ చదవండి

Pawan kalyan comments: 'గంజాయి మొక్కను ఏపీ చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది'

ABOUT THE AUTHOR

...view details