విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన తలపెట్టిన సభలో.. అధికార వైకాపాపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న జనసేన అధినేత.. ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీ, కాఫీలు తాగడానికే పార్లమెంట్‌కు వెళ్తున్నారా? అని నిలదీశారు. విశాఖ ఉక్కు కార్మాగారం ఎవరి భిక్షవల రాలేదని.. అది ఆత్మబలిదానాలతో సాధించుకున్న పరిశ్రమ అని పవన్ అన్నారు. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారు. కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్.. కార్మికులకు సంఘీభావం తెలిపారు.
శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి ఉపన్యాసం ప్రారంభించిన పవన్.. నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపే నిలబడాలన్నారు. అలా చేయని జన్మ వృథా అని అన్నారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చిందని.. ఎవరి భిక్ష వల్లో రాలేదని స్పష్టం చేశారు. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ రావటంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉందన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం అందరిలో భావోద్వేగం నింపిందన్నారు.
నా వెనుక ఎవరూ లేరు..
ఉక్కు పరిశ్రమ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని పవన్ అన్నారు. భూమి కోల్పోయిన నిర్వాసితులు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటానని చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని గతంలోనే అమిత్‌షాను కలిసి కోరామని గుర్తు చేశారు. తన వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.. తమకున్న ఒక్క ఎమ్మెల్యేనూ వైకాపా లాక్కెళ్లిందన్నారు. ఎవరూ లేకున్నా..ప్రజాబలం ఉందనే తనకు కేంద్రంలో ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని తెలిపారు. అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయని.. ఒక్క వైకాపా రాజకీయ పరిశ్రమకు తప్ప అని పవన్ ఎద్దేవా చేశారు.
మన ఎంపీలు ఎందుకు అడగలేదు ?
కార్మికుల కష్టాలు కేంద్రంలోని పెద్దలకు ఎలా తెలుస్తాయని పవన్ అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వాలని మనవాళ్లు ఎందుకు అడగటం లేదని నిలదీశారు. కేప్టివ్ మైన్స్ ఇవ్వాలని మన ఎంపీలు ఎందుకు అడగటంలేదని ప్రశ్నించారు. సొంత గనులు ఉంటే ఉక్కు పరిశ్రమకు నష్టాలు తగ్గుతాయన్నారు.