ఏపీ భవిష్యత్, తెలుగు ప్రజల ఐక్యత కోసం నేడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జరిగే సభకు వచ్చి విజయవంతం చేయాలని శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై ఈ సభా వేదికగా గళమెత్తుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వేదిక నుంచే భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు.
సభా ప్రాంగణానికి తాను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య పేరు పెట్టినట్లు పవన్ తెలిపారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. సభకు వెళ్లటం మా హక్కు అని చెప్పాలని సూచించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేసిన నాయకులను పవన్ అభినందించారు.