Pawan Kalyan on convoy vehicles issue: ఏపీ ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవటమేంటని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అది నిలదీశారు. ఎవరి ఒత్తిడితో తిరుమలకు వెళ్తున్న భక్తుల వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలన్న పవన్.. సీఎం కాన్వాయ్ కోసం వారిని నడిరోడ్డుపై వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఒంగోలు ఘటనపై రాష్ట్ర ప్రజలకు సీఎంవో వివరణ ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై సీఎస్ కూడా విచారణ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..? :ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసమంటూ.. ఒంగోలులో ఆర్టీఏ అధికారులు దౌర్జన్యకాండకు తెరతీశారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా.. నిన్న అర్ధరాత్రి ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో తిరుపతి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో.. అక్కడికి వచ్చిన ఓ రవాణాశాఖాధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని పోలీస్ కాన్వాయ్ కోసం ఇన్నోవా కారు కావాలని చెప్పారు. కారులో ఉన్న లగేజీ మొత్తం తీసుకోవాలని ఆదేశించారు.