ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేనాని... అనంతరం మాట్లాడారు. రాజధాని నిర్మాణం అంటే కొన్ని దశాబ్దాలుగా జరిగే ప్రక్రియ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం 29 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారని వివరించారు. అమరావతిని రాజధానిగా ఏకీభవిస్తున్నామని అసెంబ్లీలో అనాడు జగన్ చెప్పారని పేర్కొన్నారు. ఇవాళ ఎందుకు మాట మార్చారని నిలదీశారు. ఆందోళన చేస్తున్న రైతులకు ప్రతీ ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాలని డమాండ్ చేశారు. రాజధాని కంటే ముందు మేం రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల ప్రజలు ఎన్నుకుంటే జగన్ సీఎం అయ్యారని పవన్ పేర్కొన్నారు. కొన్ని జిల్లాల కోసమే ముఖ్యమంత్రిగా పని చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ విభేధాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతిలో అవినీతి జరిగితే చట్టాలు ఉన్నాయని... విచారణ జరిపించి శిక్షించాలని సూచించారు. నాయకులపై కోపం ప్రజలపై చూపించొద్దని హితవుపలికారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుందన్న పవన్...పెయిడ్ ఆర్టిస్టులు, ఎడారి వంటి పదాలు ఉపయోగించడం క్షమించరాని విషయమని ఉద్ఘాటించారు.
అడ్డుకోవడంపై పవన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల కన్నీరు తుడవడానికి, వాళ్ల గోడు వినడానికి వస్తున్న తనను పోలీసులు ముళ్లకంచెలు పెట్టి మరీ అడ్డుకోవడంపై... జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆగ్రహించారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ... కాలినడకనే మందడంలో ధర్నా జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. రాజధాని ప్రాంత రైతులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.