"పదవిలోకి రాక ముందు దివీస్ కాలుష్యం వెదజల్లే పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే మీరే అనుమతులిస్తే ఏం విలువలున్నట్లు? ఎలాంటి వ్యవస్థను నడపాలనుకుంటున్నారు? పర్యావరణాన్ని రక్షించే, అభివృద్ధి ప్రస్థానం ఉండేే పరిశ్రమలు రావాలి. ప్రజలకు అండగా నిలవాలి. పారిశ్రామిక ప్రగతిని నేనూ కోరుకుంటున్నా. కాలుష్యాన్ని సముద్ర జలాల్లో వదిలేస్తాం.. ఊళ్లో కలిపేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేం. పరిశ్రమను పెట్టి 54 లక్షల కిలోలీటర్ల వ్యర్థ జలాలు సముద్రంలోకి వెళ్తే అందులోని జీవాలు చనిపోతాయి. కాలుష్యం ప్రాణాలను తీసేస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రజల కన్నీళ్లపై ఎదగాలనుకోవడం సరికాదు. లాభాల వేటలో ఇంతమందిని రోడ్డుకీడుస్తారా?"
-జనసేన అధినేత పవన్‌కల్యాణ్
"మేము తెలుగు చదువుకోలేదా? వీధి బడుల్లో చదువుకోలేదా? వైకాపా నాయకులు మాట్లాడిన మాటలు మాకు రావా? మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. వారు ఏ సంస్కారాన్ని నేర్చారో తెలియదు. కాకినాడ వైకాపా ఎమ్మెల్యే నన్ను ఎలా దూషించారో మీకు తెలుసు. తిరిగి మాటనడానికి ఎంతసేపు? రోడ్ల మీదకు రాలేమా? ఎదురుదాడికి దిగలేమా? వైకాపా నాయకుల్లా మాటలు తూలను. జగన్‌రెడ్డిని కూడా గౌరవ ముఖ్యమంత్రి అని పిలుస్తా.."
- తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకలు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్
పచ్చని పల్లెల్లోకి కాలుష్య పరిశ్రమలను తీసుకొస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో దివీస్ ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బాధితులను శనివారం ఆయన పరామర్శించారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశాక సభలో మాట్లాడారు. సామాజిక ప్రభావం అంచనా వేయకుండా దివీస్ వంటి పరిశ్రమలకు ఎలా అనుమతులిస్తారని ప్రశ్నించారు. పిల్లికి ఎలుక సాక్ష్యంలా వైకాపాకు చెందిన రాంకీ సంస్థ ద్వారా అంచనా వేయించారని ఎద్దేవా చేశారు. దివీస్ కాలుష్యంతో మత్స్య సంపదకు, ప్రజలకు నష్టం జరగబోదని ప్రజలకు హామీనివ్వాలని డిమాండ్ చేశారు.
రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే దివీస్‌లో వేలాది ఉద్యోగాలు వస్తాయనుకుంటే 3వేల ఉద్యోగాలే వస్తాయని చెబుతున్నారని వివరించారు. దాని కాలుష్యం వల్ల 300 హేచరీల్లో పనిచేసే 45 వేల మంది ఉపాధి దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. విశాఖలో గ్యాస్‌లీకేజీ ప్రమాద మృతులు ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ రూ.కోటి ప్రకటించారని, ఇక్కడ ఇంతగా ఉద్యమిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దివీస్ పరిశ్రమను ఆపేది లేదని, ఎవరు అడ్డొస్తారో చూస్తామని జగన్ సవాల్ చేస్తారా? లేదా అప్పట్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.