శ్రీవారి ఆలయంలో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 17న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో అర్చకులు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, 17న అంకురార్పణ సందర్భంగా సహస్రదీపాలంకార సేవను తితిదే రద్దుచేసింది. పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
భక్తుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం: వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారికి ప్రథమ సేవకుడిగా మరోసారి అవకాశం కల్పించడం తన పూర్వజన్మ సుకృతమని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు సుబ్బారెడ్డి చెప్పారు. తితిదే ధర్మకర్తల మండలి గతంలో తీసుకున్న కొన్ని మంచి కార్యక్రమాలను కరోనా ప్రభావంతో చేయలేకపోయామని ప్రస్తుతం వాటిని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విశాఖలోని శ్రీవారి ఆలయాన్ని ఫిబ్రవరిలోనే ప్రారంభించాల్సి ఉన్నా కరోనాతో వాయిదా పడిందని తెలిపారు. స్వామీజీలతో మాట్లాడి మంచి ముహూర్తంలో ప్రారంభిస్తామన్నారు.