PASTER MURDER: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం ఏకునాంపురం గ్రామానికి చెందిన పాస్టర్ దాసరి వెంకట రమణయ్య (55)ను గుర్తు తెలియని వ్యక్తులు కాపు కాసి దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి వివరాల ప్రకారం.. పాస్టర్‌గా జీవనం సాగిస్తున్న వెంకట రమణయ్య ఆదివారం సాయంత్రం నిత్యావసరాల కోసం ఆరివేములకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు.
పాస్టర్ దారుణ హత్య.. అక్రమాలు ప్రశ్నించినందుకే ఈ ఘాతుకం?
PASTER MURDER: ఏపీలోని ప్రకాశం జిల్లా ఏకునాంపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాస్టర్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. భూ వివాదాలపై కోర్టును ఆశ్రయించడంతో అడ్డు తొలగించుకునేందుకే హత్య చేయించి ఉంటారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మార్గమధ్యలో చెర్లోపల్లి సమీపంలోని వెలుగుగొండ కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. రహదారి పక్కన ఉన్న తోటలోకి లాక్కెళ్లి తలపై బండరాయితో మోది హత్య చేశారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు.. సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాన్ని రప్పించారు. జాగిలాలు రహదారి వద్ద నుంచి మృతదేహం వద్దకు, అక్కడి నుంచి కాలువలో పడేసిన నిత్యావసరాలు ఉన్న బస్తా వద్ద, కాలువ పక్కన సంచరించాయి. క్లూస్ టీం వేలి ముద్రలను సేకరించింది.
నా భర్తను స్థానికులే హత్య చేశారు..తన భర్తను స్థానికులే కక్షతో హత్య చేశారని వెంకట రమణయ్య భార్య దాసరి నారాయణమ్మ దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పాఠశాల ప్రహరీ నిర్మాణం రాకపోకలకు అడ్డుగా ఉందని, ఉపాధి హామీ అవకతవకలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు కావడంతో కొందరు కక్షగట్టారని చెప్పారు. భూ వివాదాలపై కోర్టును ఆశ్రయించడంతో అడ్డు తొలగించుకునేందుకే వారు హత్య చేయించి ఉంటారని ఆమె ఆరోపించారు. గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులపై డీఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.