భాగ్యనగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వరద ప్రవహించింది. వరద వేగానికి వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అనేక కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్లు నీటిలో మునిగిపోయాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో సుమారు రెండు వందల ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. సుమారు 200 సెల్లార్‌లలో నీరు నిలిచి ఉందని.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయి. మోటర్ల ద్వారా నీటిని బయటకి పంపించి.. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
చీకటిలోనే..
గ్రేటర్ పరిధిలోని ఐఎస్.సదన్ డివిజన్, సింగరేణి కాలనీ, గడ్డి అన్నారం, కోదండరాంనగర్, కమలానగర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పల్లె చెరువులోని గుల్షన్‌కాలనీ, కుత్బుల్లాపూర్ పరిధిలోని ఉమామహేశ్వరకాలనీ, టోలీచౌక్ పరిధిలోని నదీంకాలనీలు అంధకారంలోనే ఉన్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని బంజారాకాలనీ, హరిహరాకాలనీ, లెనిన్‌నగర్, ప్రశాంత్‌నగర్, సత్యసాయినగర్‌లోని పలు ప్రాంతాలు చీకటిలోనే ఉన్నాయి. మీర్‌పేట, ఆల్‌జుబేల్‌కాలనీ, ఆశామాద్‌కాలనీల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. ఆయా కాలనీల్లో నివాసముండే కొందరిని పునరావస కేంద్రాలకు తరలించారు.