తెలంగాణ

telangana

ETV Bharat / city

క్యాబ్‌లో ఏసీ కావాలనుకుంటే అదనంగా చెల్లించాల్సిందే - క్యాబ్‌లో ఏసీ కావాలనుకుంటే అదనపు ఛార్జీలు

Additional Charges for AC in Cabs : సూర్యతాపాన్ని తట్టుకోలేక కాస్త ఖర్చు ఎక్కువైనా సరే చల్లగా ఏసీ క్యాబ్‌లో ప్రయాణించాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి క్యాబ్‌లో ఏసీ కావాలనుకుంటే అదనంగా రూ.50 చెల్లించాల్సిందే. ఈనెల 29 నుంచి ఉబర్, ఓలా వంటి యాప్ ఆధారిత రవాణా సంస్థలకు చెందిన క్యాబ్‌లలో ఇది అమలు కానుంది.

Additional Charges for AC in Cabs
Additional Charges for AC in Cabs

By

Published : Mar 28, 2022, 9:29 AM IST

Additional Charges for AC in Cabs : భానుడి ప్రతాపాన్ని భరించలేక క్యాబ్‌లో చల్లగా ప్రయాణించాలనుకునే భాగ్యనగరవాసులకు కాస్త చేదు వార్త. ఈ నెల 29 నుంచి (మంగళవారం) యాప్‌ ఆధారిత సంస్థలకు చెందిన క్యాబ్‌ల్లో ప్రయాణించేవారు ఏసీ కావాలనుకుంటే రూ.50 అదనంగా చెల్లించాల్సిందే. పెట్రోలు, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నా.. యాప్‌ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే కమీషన్‌ పెంచక పోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ‘నో ఏసీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలోని కొందరు డ్రైవర్లు రైడ్ల సందర్భంగా ఏసీ నిలిపేస్తున్నారు. ఏసీ కావాలంటే 25 కిలోమీటర్ల వరకూ అదనంగా రూ.25 నుంచి రూ.50 ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు డ్రైవర్లు 25- 50 కిలోమీటర్ల మధ్య ప్రయాణానికి రూ.100 ఇవ్వాలంటున్నారు. ప్రయాణికులు తమ సమస్యను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.

అసలు సమస్యేటంటే..? గత రెండేళ్లలో పెట్రోలు, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా ఓలా, ఉబర్‌ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే బేస్‌ ఫెయిర్‌ పెంచలేదని, రెండేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని ట్యాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డ్రైవర్‌కు బేస్‌ ఫేర్‌ రూ.12-13 వరకూ ఇస్తున్నారని, పెరిగిన ఇంధన ధరల ప్రకారం రూ.24 నుంచి 25 వరకూ ఇవ్వాలని కోరుతున్నారు. ధరలు పెంచితే ప్రయాణికులకు ఏసీ సదుపాయం కల్పించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. క్యాబ్‌లలో ‘నో ఏసీ’ ప్రచార కార్యక్రమం తొలుత కోల్‌కతాలో ప్రారంభమైంది. అనంతరం దిల్లీ, ముంబయి, లఖ్‌నవూలో టాక్సీ డ్రైవర్లు దీన్ని అనుసరించాయి. తాజాగా హైదరాబాద్‌ డ్రైవర్లు దీన్ని ప్రారంభించారు.

ప్రయాణికులు సహకరించాలి

"ఓలా, ఉబర్‌ సంస్థలు గిట్టుబాటు ధర పెంచడం లేదు. అగ్రిగేటర్‌ గైడ్‌ లైన్స్‌ పాలసీ అమలు చేయాలని రవాణా శాఖను కోరినా.. ఇంధన ధరలు పెరిగాయని చెప్పినా.. మంత్రి, ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా సమస్యలు ఎవరికి చెప్పాలి? ప్రయాణికులకు అసౌకర్యం కల్పించడం మా ఉద్దేశం కాదు. మాకు సహకరించాలని వారిని కోరుతున్నాం. మానవతా దృక్పథంతో కొందరికి ఏసీ సదుపాయం కల్పిస్తున్నాం."

- షేక్‌ సలావుద్దీన్‌, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details