ఆంధ్రప్రదేశ్లోని విశాఖ విమానాశ్రయం నుంచి విమానాలు పెరుగుతున్న తీరుతో.. ప్రయాణికుల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. వివిధ విమాన సంస్థలు కూడా ఇక్కడికి తమ సర్వీసుల్ని తెచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండటం మంచి పరిణామంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కేవలం దేశీయ విమాన సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులకు ఇంకా అనుమతులు రాలేదు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు విమానాశ్రయ అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.
పెరిగిన బుకింగ్స్..
దేశంలోని కీలక నగరాలకు వెళ్లేందుకు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేందుకు ఇప్పుడు విశాఖ విమానాశ్రయం నిలయంగా మారింది. గత కొన్నిమాసాలతో పోల్చితే ప్రత్యేకించి ఆగస్టులో బుకింగ్లు బాగా పెరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలు సులభతరం అవడం, పర్యాటక ప్రాంతాలు తెరచుకోవడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత 27 రోజుల్లో విశాఖ నుంచి ఏకంగా 1.34 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. ఇందులో 51శాతం మంది వివిధ ప్రాంతాలనుంచి విశాఖకు రాగా, మరో 49శాతంమంది విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఉన్నారు. తాజా పరిస్థితుల్ని బట్టి రోజుకు సగటున సుమారు 5వేల మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గత ఏడాది ఆగస్టులో విశాఖ నుంచి సుమారు 61 వేల మంది మాత్రమే రాకపోకలు చేశారు. ఈసారి ఆగస్టులో రెట్టింపుకన్నా ఎక్కువగా ప్రయాణాలు పెరిగాయి. నెలలో లక్షన్నర ప్రయాణాలు దాటొచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. జులైలో రోజువారీ 30 నుంచి 36 విమానాలు రాకపోకలు చేస్తుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య రోజుకు 46కు పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నుంచి దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్కతా, విజయవాడ, కర్నూలు, రాయపూర్, పోర్టుబ్లెయర్ తదితర ప్రాంతాలకు విమానాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల క్యూలు పెరుగుతున్నాయి.