రోజు గంటలా గడుస్తోంది... గంట నిమిషంలా గడుస్తోంది... గడువు గుండెల్లో రైలుపెట్టిస్తోంది... చల్లని చలిలోనూ గ్రేటర్ ఎన్నికలు నేతలకు చెమటలు పట్టించే వేడిని పుట్టిస్తున్నాయి. మెరుపువేగంతో దూసుకువచ్చిన బల్దియా ఎన్నికల నోటిఫికేషన్.. తాపీగా ఉన్న పార్టీలను పరుగులు పెట్టించింది. ఆగమేఘాల మీద నామపత్రాల పర్వాన్ని పూర్తిచేసుకున్న రాజకీయ పార్టీలు.. ఇక కదనరంగంలో దూకేందుకు సిద్ధమయ్యాయి. మూడ్రోజుల గడువులోనే అంతే వేగంతో పావులు కదుపుతూ.. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా సమరానికి సిద్ధమైన పార్టీలు.. ప్రత్యర్థులకు చిక్కకుండా వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నాయి.
అదే జోరుతో కారు
గ్రేటర్‌పోరుకు అందరి కంటే ముందుగానే సన్నద్ధమైన కారు.. అదే జోరుతో ముందుకు సాగుతోంది. మరోసారి పీఠాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ప్రచారానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మరో 10రోజుల గడువు మాత్రమే ఉన్నందున.. నాలుగు దశలుగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి దశలో అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయనుండగా.. రెండో దశలో డివిజన్ ఇంఛార్జిలు బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాదయాత్రలు చేయనున్నారు. మూడో దశలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు జరపనున్నారు. చివరిగా అధినేత కేసీఆర్ సభ నిర్వహించేలా గులాబీ దళం ప్రణాళికలు రూపొందించింది. నోటిఫికేషన్‌కు ముందే గ్రేటర్ ఎన్నికల పట్ల అప్రమత్తమైన అధికార పార్టీ... సిట్టింగ్ కార్పొరేటర్లతో అంతర్గత ప్రచారం పూర్తిచేసింది. వ్యూహాత్మకంగా వారందరినీ లాక్‌డౌన్, వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ నాయకత్వం పురమాయించింది. ప్రచార గడువు ముగిసేలోగా ఒక్కో ఇంటికి కనీసం రెండు మూడు సార్లైనా తిరగాలని అభ్యర్థులకు సూచించింది.
క్షేత్రస్థాయిలో వ్యూహాలు
డివిజన్లలో శ్రేణులతో కలిసి ఇప్పటికే పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు... విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలాబలాలు, ఇతర పార్టీల అభ్యర్థుల వివరాలు సేకరించి... అధినేత వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నారు. టిక్కెట్లు దక్కక నిరాశతో ఉన్న వారిని బుజ్జగిస్తూ... శ్రేణులను ఏకం చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లోనే మంత్రి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. రోజుకు దాదాపు పది, పన్నెండు చొప్పున వారం రోజుల్లో వందకు పైగా డివిజన్లలో ప్రచారం చేయాలని తెరాస భావిస్తోంది. మెరుపు పర్యటనలతో.. నగరాభివృద్ధి, విపక్షాల ప్రచారాలను తిప్పికొట్టేలా ప్రచార అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.
దుబ్బాక ఫలితాలు పునరావృతమయ్యేలా..
దుబ్బాక ఫలితాలను బల్దియా ఎన్నికల్లోనూ పునరావృతం చేసేలా కమలదళం వ్యూహాలు పన్నుతోంది. నోటిఫికేషన్ సమయంలోనే గ్రేటర్ కోసం పావులు కదుపుతున్న భాజపా... డివిజన్ల వారీగా ఇంఛార్జిలను సైతం నియమించింది. ఉపఎన్నిక గెలుపు ఉత్సాహాన్ని అలాగే కొనసాగించాలని భావిస్తున్న ఆ పార్టీ.. బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తులు చేసింది. ఈ క్రమంలోనే తెరాస, కాంగ్రెస్‌లో అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు నామినేషన్ల చివరి వరకు అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర సర్కార్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. బూత్ స్థాయిలో నాయకులను నియమించి గెలుపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు పార్టీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, డి.కె.అరుణ, మురళీధర్‌రావు, వివేక్, రాజాసింగ్, అర్వింద్, గరికపాటి మోహన్‌రావు, రఘునందన్‌రావులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది.
సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలు
ఇక వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ఈ సారైనా సత్తాచాటేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. నోటిఫికేషన్ నాటికి ఏ మాత్రం అప్రమత్తంగా లేని ఆ పార్టీ నేతలు.. అనంతరం ఆగమేఘాలతో కసరత్తులు ప్రారంభించారు. పార్టీకి ఉన్న క్యాడర్ దృష్ట్యా... బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి... ప్రత్యర్థులను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. డివిజన్ల వారీగా సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్... బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించింది. దుబ్బాక ఉపఎన్నికలో నాయకత్వమంతా కలిసి సాగిన విధంగానే గ్రేటర్ ఎన్నికల్లోనూ ముందుకెళ్లి అంతర్గత విభేదాలు లేవన్న భావన తీసుకురావాలని నిర్ణయించారు.
కీలకంగా మారాలని భావిస్తున్న ఎంఐఎం
ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీలతో కలిసిసాగే మజ్లిస్ ఈ సారి వేచిచూసే ధోరణితో ముందుకు సాగుతోంది. తమదైన ప్రచారంతో ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా యత్నిస్తుండగా.. అదే తరహా ప్రయోగాలు చేయాలని ఎంఐఎం భావిస్తోంది. సాధారణంగా సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇచ్చి... స్నేహపూర్వక పోటీకి ఆ పార్టీ సై అంటుండేది. బిహార్‌లో ఇటీవల ఆ పార్టీ అనూహ్యంగా సాధించిన విజయంతో హైదరాబాద్‌లోనూ తన బలం పెంచుకొనేందుకు పావులను కదుపుతోంది. ఇటీవలి వరదలతో మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలే ఎక్కువగా ముంపునకు గురైన నేపథ్యంలో దాని ప్రభావం చూపకుండా గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తోంది. 2009లో కాంగ్రెస్ సహకారంతో రెండున్నరేళ్లపాటు మేయర్ స్థానంలో కొనసాగిన మజ్లిస్... 2016 నగర పాలక ఎన్నికల్లో తెరాస స్పష్టమైన ఆధిక్యత సాధించటంతో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ రెండు పదవులు ఆ పార్టీకే దక్కాయి. ఈసారి మాత్రం తెరాసకు పూర్తిస్థాయి విజయం దక్కకపోతే తామే చక్రం తిప్పుతామని ఎంఐఎం నేతలు అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి: తెరాస గ్రేటర్ అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం