కరోనా నేపథ్యంలో ఆదాయం కోసం సరకు రవాణాపై రైల్వేశాఖ దృష్టిసారించింది. ఇందుకు ముందస్తు రిజర్వేషన్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. వినియోగదారులు తమకు కావల్సినంత పార్సిల్ స్పేస్ (స్థలం)ను బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం ప్రతి ప్రయాణికుల రైలుకు అదనంగా ఓ బోగీని తగిలించబోతుంది. దాన్ని పూర్తిగా పార్సిల్ వ్యాన్‌గా నడుపుతారు. ప్రస్తుతం సాధారణ రైళ్లకు 24, ఎల్‌హెచ్‌బీ రైళ్లకు గరిష్ఠంగా 22 బోగీలకే అనుమతి ఉంది. వీటికి అదనంగా పార్సిల్ వ్యాన్ రానుంది. పార్సిల్ ప్రత్యేక రైళ్లలో లగేజ్‌రూంలోనూ స్థలాన్ని బుక్ చేసుకోచ్చు. ఈ మేరకు రైల్వేబోర్డు జోనల్ రైల్వేలకు అనుమతి ఇచ్చింది. ఆదాయం పెంచుకోవడం కోసం ఇటీవలే మందులు, మామిడిపండ్లు, పసుపు, మిర్చి వంటి అత్యవసర, వ్యవసాయ ఉత్పత్తుల రవాణానూ రైల్వేశాఖ మొదలుపెట్టింది. ఇది ఫలితాలిస్తుండటంతో భవిష్యత్తులో పార్సిల్ ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు ప్రయాణికుల రైళ్లకు పార్సిల్ వ్యాన్లను జతచేయనుంది.
4 నెలల ముందు బుకింగ్
రైల్లో సరకులు రవాణా చేయాలంటే ఇటీవల వరకు అదోవ్యయప్రయాసల వ్యవహారం. కనీసం 40 వ్యాగన్లు బుక్ చేసుకోవాలి. వ్యాగన్లు ఖాళీ ఉంటే ఇంజిన్, అది ఉంటే వ్యాగన్లు ఖాళీ ఉండేవి కాదు. ఆ రెండూ ఖాళీగా ఉన్నప్పుడే లోడింగ్ జరిగేది. ఇక తాజాగా తక్కువ పరిమాణంలోనూ, ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు రవాణా చేసుకునే సదుపాయాన్నీ రైల్వే తీసుకురాబోతుంది. నాలుగు నెలల ముందు కూడా ముందస్తు బుకింగ్‌కు అనుమతించాలని రైల్వేబోర్డు శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
బుకింగ్ చేసుకుంటే ముందు 10% మొత్తం, రైలు బయల్దేరడానికి 72 గంటల ముందు మిగతామొత్తాన్ని చెల్లించాలని ద.మ.రైల్వే తెలిపింది. రద్దు చేసుకోవాలనుకుంటే 72 గంటల ముందు తెలపాలని.. అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తంలో 50% మొత్తం తిరిగి వస్తుందని పేర్కొంది. గతంలో గూడ్సు రైళ్ల సగటు వేగం 25-30 కి.మీ.కి మించకపోయేది. ఇప్పుడు ప్రత్యేకచర్యలతో గంటకు 50కిమీకి పెరిగింది. 9న అనంతపురం నుంచి బయల్దేరి దిల్లీ వెళ్లిన కిసాన్ రైలు 2,150 కి.మీ. దూరాన్ని 40 గంటల్లోనే చేరుకుంది. 14 పార్సిల్ వ్యాన్లతో ఈ రైలును నడిపించారు. తక్కువ దూరం సరకు రవాణాను ప్రోత్సహించేందుకు 20-50% వరకు రాయితీల్ని ద.మ.రైల్వే ప్రకటించింది. వ్యవసాయోత్పత్తులు, సరకుల రవాణా పెంచడానికి హెల్ప్‌లైన్ 139 నంబరును పార్సిల్ రవాణా సేవలకు ఉపయోగించుకుంటోంది.