తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్రిక్తతల నడుమ ముగిసిన పరిషత్ పోరు - రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా వార్తలు

భౌతిక దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు గెంటేయడం, రిగ్గింగ్‌కు ప్రయత్నాలు.. వీటన్నింటి నడుమ ఆంధ్రప్రదేశ్​ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ గురువారం ముగిసింది. పలు చోట్ల ఘర్షణల కారణంగా వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు.

ap parishad election news, Andhra Pradesh news
ఉద్రిక్తతల నడుమ ముగిసిన పరిషత్ పోరు

By

Published : Apr 9, 2021, 9:38 AM IST

భౌతిక దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, వైకాపా,తెదేపా నాయకుల ఘర్షణల మధ్య ఆంధ్రప్రదేశ్​ పరిషత్ పోరు గురువారం ముగింసింది. పలు చోట్ల పరిషత్ ఎన్నికలు ఉద్రిక్త వాతావరణాన్ని తలపించాయి. ఏపీ అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లెలో జనసేన నాయకుడు చిలకం మధుసూదనరెడ్డి ఇంటిపై వైకాపా శ్రేణులు రాళ్లదాడి చేశాయి. గుంతపల్లిలో తెదేపా నాయకుడు మారుతీప్రసాద్‌పై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బాణం పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ వల్ల కొంతసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కడియంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి, నలుగురు తెదేపా మద్దతుదారులకు గాయాలయ్యాయి. అమలాపురం ఎస్కేబీఆర్‌ కళాశాల వద్ద వైకాపా, జనసేన నాయకులు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సత్యనాగేంద్రమణి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లతో మాట్లాడటంపై జనసేన నాయకులు అభ్యంతరం చెప్పటంతో ఉద్రిక్తత నెలకొంది.

* విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో తెదేపా మద్దతుదారులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అయిదుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు.

* పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి ఏకుల గడ్డియ్యపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. తాను ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొట్టడంతో రోడ్డు పక్కన పడిపోయానని చెప్పారు. ఆయనను కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

* కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెరికలపాడు వద్ద తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

* నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం పొనుగోడులో భాజపా ఏజెంటు బ్యాలెట్‌ బాక్సును ఎత్తుకెళ్లి నీటితొట్టెలో పడేశారు. ఇక్కడ రీ పోలింగ్‌కు ఆర్వో ఆదేశించారు. ఉదయగిరి మండలం గానుగపెంటపల్లిలో వైకాపా, స్వతంత్ర అభ్యర్థి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

* గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులపై పోలింగ్‌ కేంద్రం వద్దే వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. పెదకూరపాడు మండలం గారపాడులో వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యడ్లపాడు మండలం కారుచోలలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగి పదిమంది గాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్‌.. ఈ ఘర్షణకు దారి తీసింది.

* చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కోనపల్లిలో ఓటు వేసేందుకు తెదేపా మద్దతుదారులు వస్తుండగా.. వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బయట ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు తీసుకొచ్చి ఓటు వేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని కేజీవీ పురంలో తెదేపా నాయకులు అభ్యంతరం చెప్పారు.

ప్రతిపక్ష ఏజెంట్ల గెంటివేత..

* అనంతపురం జిల్లా వెంకట తిమ్మాపురంలో భాజపా పోలింగ్‌ ఏజెంటును వైకాపా కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు తీసుకొచ్చి కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. కనగానిపల్లె మండలంలో సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థి పోలింగ్‌ ఏజెంట్లను వైకాపా నాయకులు బెదిరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

* విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం జిల్లేడుపూడిలో తెదేపా పోలింగ్‌ ఏజెంటుపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తలకు తీవ్ర గాయాలవ్వటంతో అతడిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు.

* నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులో వైకాపా తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా రౌడీషీటర్లను పెట్టారని స్వతంత్ర అభ్యర్థి తరఫు ఏజెంట్లు పోలింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. వారిపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో ఇద్దరు ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతతో కాసేపు పోలింగ్‌ నిలిచిపోయింది.

* కడప జిల్లా బద్వేలు మండలం ఉప్పటివారిపల్లెలో తెదేపా పోలింగ్‌ ఏజెంట్లను బయటకు పంపేశారని తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి ఆందోళన చేపట్టారు.

* తెదేపా అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా వస్తుండగా వైకాపా నాయకులు దాడిచేశారని తెదేపా శ్రేణులు ధర్నాకు దిగటంతో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో ఉద్రిక్తత నెలకొంది. గోనెపూడిలో వైకాపా నాయకులు పోలింగ్‌ కేంద్రం వద్ద తమను అడ్డుకుని దాడికి ప్రయత్నించారని తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి శ్రీదేవి తదితరులు ఆరోపించారు. అనంతరం వీరంతా నరసరావుపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

* గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం గోపువారిపాలెంలో తెదేపా ఏజెంట్లను అడ్డుకోగా, పోలీసులు జోక్యం చేసుకుని పోలింగ్‌ కేంద్రంలోకి పంపారు.

రిగ్గింగ్‌కు అభ్యంతరం తెలిపారని..

* కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెదేపా పోలింగ్‌ ఏజెంటు వెంకటేశ్‌పై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడిచేశారు. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకాపా నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపించడంతో ఘర్షణ చెలరేగింది. నేతలమర్రిలో అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెదేపా కార్యకర్త చంద్ర ఆరోపించటంతో వైకాపా నాయకులు అతనిపై దాడిచేశారు. కర్రలు, రాళ్లు పట్టుకుని వైకాపా నాయకులు బేతపల్లి పోలింగ్‌ కేంద్రం చుట్టూ ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ నిలబడి.. అందర్నీ భయపెట్టారు. కప్పట్రాళ్లలో తెదేపా, వైకాపా నాయకులు ఘర్షణకు దిగారు.

* శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో వైకాపా నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని భాజపా, జనసేన కార్యకర్తలు ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు.. ఈ రెండు పార్టీల కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఉర్దూ పాఠశాల పోలింగ్‌ కేంద్రాల్లోకి 50 మంది చొచ్చుకెళ్లి రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. ఓ ప్రధాన పార్టీ నాయకుడు వారితో కలిసి లోపలికి ప్రవేశించారు. ఎన్నికల అధికారులు వీడియో తీయటంతో వారంతా పరుగులు తీశారు.

* గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకలో వైకాపా కార్యకర్త కిశోర్‌ దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తుండగా జనసేన ఏజెంటు కసుకుర్తి మల్లికార్జునరావు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్‌ పూర్తయ్యాక మల్లికార్జునరావుపై కిశోర్‌, మరికొందరు దాడి చేశారు. అదే సమయంలో జనసేన అభ్యర్థులు అటు రావడంతో పారిపోయారు.

యథేచ్ఛగా రిగ్గింగ్‌..

గుంటూరు జిల్లాలో రిగ్గింగ్‌ భారీగా జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో ఓటర్ల వేలికి సిరారాసి వారిని ఇళ్లకే పరిమితం చేసి, వైకాపా ఏజెంట్లే ఓట్లు వేసుకున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. చిట్టాపురం ఎంపీటీసీ స్థానం పరిధిలోని గోపువారిపాలెంలో తెదేపా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రంలోకి రాకుండా గేటువేసి అడ్డుకున్నారు. ఏజెంటు పత్రాలను వైకాపా నాయకులు లాక్కుని చించేయడంతో తాము పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లలేకపోయామని తెదేపా ఏజెంటు నెల్లూరి వెంకట్రావు తెలిపారు. ఎస్సై సింగయ్య వచ్చి తెదేపా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు.పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఉయ్యందనలో రిగ్గింగ్‌ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఉయ్యందన పోలింగ్‌ కేంద్రాల్లోకి కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు చొచ్చుకొచ్చి బ్యాలెట్‌ పేపర్లను లాగేసుకుని ఏకపక్షంగా ఓట్లేసుకొని వెళ్లిపోయారని స్థానిక తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. దీనిపై తమకు ఫిర్యాదులేవీ అందలేదని ఎంపీడీవో బాలమ్మ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా

ABOUT THE AUTHOR

...view details