తెలంగాణ

telangana

ETV Bharat / city

'సార్.. మా పిల్లాడిని డైరెక్ట్‌గా ఒకటో తరగతిలో వేసేస్తాం' - school fee in telangana

"సార్‌.. మా పిల్లాడికి ఆరేళ్లు వచ్చాయి. రెండేళ్లుగా ఇంటి దగ్గరే అక్షరాలు చదవడం, రాయడం నేర్పించాం. మావాడు ఒకటో తరగతి తగ్గ స్థాయిలో ఉన్నాడు. మళ్లీ ఎల్‌కేజీ, యూకేజీ చదివించాలంటే వయసు ఎక్కువ అవుతుంది. ఫీజులూ కట్టాలి. నేరుగా ఒకటిలో చేర్చుకోండి.’’ -- నగరంలో ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల్లో చెబుతున్న మాటలివి..!

telangana schools
telangana schools

By

Published : Jul 3, 2022, 10:11 AM IST

ముందుగా నర్సరీ.. అక్కడి నుంచి ఎల్‌కేజీ.. యూకేజీ.. ఆ తర్వాత ఒకటో తరగతిలోకి పిల్లలను పంపిస్తుంటారు. కానీ కరోనాతో రెండున్నరేళ్లుగా పాఠశాలలు సరిగా నిర్వహించలేదు. గత విద్యా సంవత్సరంలో తెరిచినా.. ప్రీప్రైమరీ తరగతులు నడవలేదు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో 3, 4 సంవత్సరాల వయసున్న చిన్నారులు ఇంటికే పరిమితమయ్యారు. తల్లిదండ్రులే వారికి వర్ణమాల వంటివి నేర్పించారు. కొందరు తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూటర్లను ఏర్పాటు చేయడం లేదా ఆన్‌లైన్‌ తరగతులలో చదువు చెప్పించడం వంటివి చేశారు. ఇప్పుడా పిల్లలను నేరుగా ఒకటో తరగతిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

ఆ స్థాయి అందుకునేదెలా..ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లల్లో దాదాపు 60-70 శాతం మంది ప్రీ ప్రైమరీలో అక్షరాలు తప్ప ఏమీ నేర్చుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం యూకేజీ స్థాయిలోనే పర్యావరణంపై పాఠాలు ఉంటున్నాయి. పదాలు, వాక్యాలు రాసే స్థాయికి కిండర్‌గార్టెన్‌లో పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. ఇవేమీ లేకుండా నేరుగా ఒకటో తరగతిలో చేర్పించడంతో ఆస్థాయిని అందుకోవడం కష్టమవుతుందన్నది ఉపాధ్యాయులు చెప్పేమాట. దీన్ని నివారించేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సును తీసుకువచ్చాయి. నేరుగా ఒకటో తరగతిలో చేరిన పిల్లలకు ప్రాథమికాంశాలు నేర్పించి, ఆ తర్వాత రెగ్యులర్‌ పాఠ్యాంశాలు బోధిస్తున్నాయి.

‘‘ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లలకు అక్షరాలు రాయడమే వస్తోంది. వాక్య నిర్మాణం రావడం లేదు. అయినా వయసు రీత్యా అదే తరగతిలో చేర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి లేఖలు తీసుకుని ప్రవేశాలు కల్పిస్తున్నాం.’’ అని కొండాపూర్‌లోని స్వాతి స్కూల్‌ కరస్పాండెంట్‌ ఫణికుమార్‌ వివరించారు.

వయసు పెరిగిపోతోందని ఆందోళన..పిల్లలను ఏదైనా తరగతిలో చేర్చుకునేందుకు వయసు కీలకం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వయసు ప్రకారం చేర్పించుకుంటారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఒకటో తరగతిలో పిల్లలకు ఆరేళ్ల వయసుండాలి. రెండేళ్లుగా కిండర్‌గార్టెన్‌ తరగతులు చదవకపోయినా వయసు దృష్ట్యా నేరుగా ఒకటో తరగతిలో చేర్పించాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో నచ్చజెప్పి యూకేజీలో చేర్పిస్తున్నారు. మరోవైపు ఫీజుల భారం తట్టుకోలేక ఒకటో తరగతికే మొగ్గు చూపుతున్నారు. ప్రతిభకు తగ్గట్టుగా లేకపోతే పిల్లల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రాథమికాంశాలు నేర్పించడం మేలు.. "ప్రవేశాల కోసం వస్తున్న తల్లిదండ్రులు వయసు ప్రకారం ఏ తరగతిలో ఉండాలో.. అందులోనే చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ చదవకపోతే, ఒకటో తరగతిలో కుదురుకోలేరని చెప్పినా అంగీకరించడం లేదు. తల్లిదండ్రులు సరేనంటే ఒక తరగతి కింది స్థాయిలో చేర్చుతున్నాం. లేకపోతే నేరుగా ఒకటో తరగతిలో తీసుకుంటున్నాం. ముందుగా పిల్లలకు ప్రాథమికాంశాలు నేర్పిస్తే మంచిది." - వాసిరెడ్డి అమర్‌నాథ్‌, స్లేట్‌ విద్యాసంస్థల అధినేత

తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నాం.. "ప్రవేశాల విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమే. రెండేళ్లుగా పాఠశాలలో చేరని విద్యార్థులు ఇప్పుడు వస్తున్నారు. కొందరు పిల్లలకు ఏ,బీ,సీ,డీ వంటివి రావడం లేదు. తల్లిదండ్రులకు నచ్చచెప్పి కనీసం ఒక ఏడాది కింది తరగతిలో చేర్పించాలని చెబుతున్నాం. కానీ చాలామంది అంగీకరించడం లేదు. ఒకటో తరగతే కాదు.. మిగిలిన తరగతుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది."

- ఉమమహేశ్వరరావు, నైటింగేల్‌ హైస్కూల్‌, సోమాజిగూడ

ABOUT THE AUTHOR

...view details