చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆటలకు కొందరు బానిసలై.. వాటి కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్లే స్టోర్స్‌లో వేర్వేరు రకాల గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తొలుత రూ.100, రూ.200 రీఛార్జి చేయాలంటూ తల్లిదండ్రులను అడిగి.. తర్వాత వారి నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు.. ఓటీపీలను తీసుకుని ఆటల కోసమే రూ.లక్షలు ఖర్చుపెడుతున్నారు. నిషేధిత పబ్జీతో పాటు నలభై నుంచి యాభై రకాల ఆటలను ఆడుతూ రూ.వేలు.. రూ.లక్షలు నగదు బదిలీ చేస్తున్నారు. తల్లిదండ్రుల గారాబం.. పాఠశాలలు, ఇంటిపరిసర ప్రాంతాల్లో స్నేహితుల కారణంగా వీరంతా ఆటలాడుతున్నారని పోలీసులు గుర్తించారు. టీవీల్లో వచ్చే హింసాత్మక కార్యక్రమాలు.. చరవాణుల్లో క్రీడలు.. ఓడిపోకూడదన్న కసి వారిలో హింసను ప్రేరేపిస్తున్నాయని గమనించారు. వీటిని ఇప్పటి నుంచే కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ప్రమాదాలంటూ హెచ్చరిస్తున్నారు.
ఆరునెలలు... ఆటలాండేందుకు రూ.36లక్షలు
హైదరాబాద్‌లో ఉంటున్న ఒక ఇంటర్ విద్యార్థి కేవలం ఆరునెలల్లో తన చరవాణిలో వింజోగేమ్ ఆడేందుకు రూ.36లక్షలు ఖర్చు చేశాడు. ప్రభుత్వశాఖలో విధులు నిర్వహిస్తున్న విద్యార్థి తండ్రి గతేడాది ఆకస్మికంగా చనిపోతే... నష్టపరిహారం కింద ప్రభుత్వం రూ.37లక్షలు ఇచ్చింది. వీటిని విద్యార్థి తల్లి, సోదరి, విద్యార్థి ఖాతాలో కొద్దినెలల క్రితం జమచేసింది. నగదు జమకాలేదంటూ వీరు కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా... ముగ్గురి ఖాతాలో నగదు జమచేశాం.. ప్రస్తుతం మీ ముగ్గురి బ్యాంక్ ఖాతాల్లో రూ.520లు నగదు నిల్వలున్నాయని చెప్పారు. దీంతో షాక్‌కు గురైన విద్యార్థి తల్లి సైబర్ నేరస్థులు డబ్బు కాజేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా... దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతేడాది డిసెంబరు నుంచి మే 25 వరకు రూ.36లక్షలు వింజోగేమ్స్ కోసం విద్యార్థి వినియోగించాడని చూపించారు.
*వింజోగేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థి గేమ్‌లోని అంచెలను(లెవల్స్) గెలిచేందుకు ఆడాడు. రూ.వెయ్యి, రూ.2వేలు లాభం రావడంతో రూ.5వేలు, రూ.10వేలు నగదు బదిలీ చేసుకుని ఆడగా... వరుసగా ఓడిపోయాడు..