Parents received gold medal for deceased son: పిల్లలు విజయాలు సాధిస్తే.. పది మందికి చెబుతూ మురిసిపోతుంటారు. ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన తమ కుమారుడిని అభినందిస్తే.. ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదే. కానీ, ఆ విజయం సాధించిన కుమారుడే లేకపోతే.. ఆ బాధ వర్ణణాతీతం.
శుభతరుణం.. కానీ కొడుకే లేడు: చెమ్మగిల్లిన అమ్మ కళ్లు - కుమారుడు మరణానంతరం గోల్డ్ మెడల్
Parents received gold medal for deceased son: పిల్లలు చిన్న విజయాలు సాధించినా.. తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. పది మందికి చెబుతూ ఆనందిస్తారు. ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన తమ కుమారుడిని అభినందిస్తూ.. పాఠశాల యాజమాన్యం బంగారు పతకం, ప్రశంసా పత్రం ఇచ్చేందుకు తల్లిదండ్రులకు కబురుపెట్టింది. ఇలాంటి శుభతరుణంలో అమ్మకళ్లు చెమ్మగిల్లాయి. కానీ పేరు తెచ్చిన కుమారుడు మాత్రం కళ్లముందు లేడు.
![శుభతరుణం.. కానీ కొడుకే లేడు: చెమ్మగిల్లిన అమ్మ కళ్లు Parents received gold medal for deceased son](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15818179-568-15818179-1657764576490.jpg)
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి ఇమ్రాన్ షేక్, గౌసియా దంపతుల కుమారుడు ఎస్.లుబేద్(7) వివేకవర్ధిని పాఠశాలలో చదివేవాడు. ఆల్ ఇండియా ఒలింపియాడ్ సైన్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా.. జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచాడు. 2019-20లో ముంబయికి చెందిన నేషనల్ నం.1 సంస్థ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఒలింపియాడ్ పోటీలు నిర్వహించారు.
అప్పుడు ఒకటో తరగతి చదువుతున్న లుబేద్ ఈ పోటీ పరీక్షకు హాజరయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలుడు గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడి చేరాడు. కాగా.. పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను బుధవారం నిర్వాహకులు పాఠశాలకు పంపారు. పాఠశాల కరస్పాండెంట్ చిత్రలేఖ బాలుడి తల్లిదండ్రులను పిలిచి బంగారు పతకం, ప్రశంసాపత్రం, రూ.వెయ్యి చెక్కును అందించారు. బహుమతి అందుకుంటున్న ఆ తల్లిదండ్రుల కన్నీరు ఆగలేదు.