తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆన్‌లైన్‌ క్లాస్‌లపై అయోమయం.. విద్యాశాఖ తర్జన భర్జన - ఆన్​లైన్ తరగతుల వార్తలు

రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ బోధన అయోమయంగా మారింది. కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి టీవీ ద్వారా డిగ్రీ పాఠాల బోధన ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ.. ఆగస్టు 3 నుంచి పాఠశాల విద్యార్థులకూ ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ బడుల విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్ ద్వారా బోధన ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ... ఆశించిన ప్రయోజనాలు అందడం లేదు. అయితే ఒక్కో చోట ఒక్కో విధానమేంటని.. స్పష్టమైన సమగ్రమైన పాలసీ ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించడంతో.. ఏం చేయాలని విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది.

online class
online class

By

Published : Jul 6, 2020, 4:11 PM IST

రాష్ట్రంలో బడి పిల్లలకు ఆన్ లైన్ బోధనపై స్పష్టత కరవై.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళానికి దారి తీస్తోంది. విద్యా సంవత్సరం జూన్ 12నే ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ... కరోనా పరిస్థితుల కారణంగా బడులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అంతు చిక్కడం లేదు. కార్పొరేట్ పాఠశాలలు సుమారు నెల రోజుల నుంచే ఆన్ లైన్ వర్చువల్ తరగతులు ప్రారంభించాయి. జూమ్, వెబెక్స్, స్కైప్ వంటి వాటి ద్వారా ఇంటరాక్టివ్ పద్ధతులతో తరగతులు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు తమ ఉపాధ్యాయలతో వీడియో పాఠాలు చెప్పించి.. వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపిస్తున్నాయి. అయితే బడ్జెట్ పాఠశాలలు, చిన్న చిన్న ప్రైవేట్ బడులు సరైన వనరులు లేక ఆన్ లైన్ బోధన చేపట్టలేక పోతున్నాయి.

అసమానతలు వస్తాయి

ఓ వైపు కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్‌లో దూసుకెళ్తుండగా.. మరోవైపు ఇతర బడులు ప్రవేశపెట్టక పోవడంతో.. గందరగోళం తలెత్తుతోంది. ప్రస్తుతం ఆన్ లైన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వాదనలు ఉండగా.. దీనివల్ల ఒకే తరగతికి చెందిన విద్యార్థుల మధ్య విద్యా అసమానత తలెత్తుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్సీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో నేటి నుంచి వీడియో పాఠాలు మొదలు పెట్టాయి. ఆగస్టు 3 నుంచి 11 వరకు పాఠశాల విద్యార్థులకు కూడా వీడియో పాఠాలను ప్రసారం చేయాలని నిర్ణయించారు. దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా రోజూ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు.. రోజూ 30 నిమిషాల పాటు ఈ వీడియో పాఠాలను ప్రసారం చేస్తామని సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఎప్పటినుంచో ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలా వద్దా అనే అంశాన్ని... విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని అంశాలు అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించారు. వాస్తవానికి పాఠశాల విద్య శాఖ కొన్నేళ్ల నుంచే వీడియో పాఠాలను బోధిస్తోంది. రాష్ట్ర విద్య సాంకేతిక సంస్థ ఆరు నుంచి పదో తరగతి వరకు వీడియో పాఠాలను రూపొందించి.. టీశాట్ విద్య, దూరదర్శన్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేస్తోంది. అయితే ఆ పాఠాలను చూస్తున్న విద్యార్థులు చాలా తక్కువ. రోజూ ఒక్కో తరగతికి ఒక్కో సబ్జెక్టు మాత్రమే ప్రసారం చేస్తున్నారు. అయితే విద్యార్థులకు వాటి వివరాలు తెలియక పోవడం.. విద్యార్థులను ఆకర్షించపోవడం వల్ల.. వృథా ప్రయాసగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీశాట్ చానెళ్లను ఆన్ లైన్ పాఠాల కోసం మరింత వినియోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే తరగతి బోధనకు ఆన్ లైన్ ప్రత్యామ్నాయం కాదని.. తగిన జాగ్రత్తలతో పాఠశాలలు ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

13న మరోసారి హైకోర్టులో విచారణ

కార్పొరేట్ తరహాలో వర్చువల్ తరగతులు నిర్వహించాలంటే.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ ఉండటంతో పాటు.. ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో.. కొందరి ఇళ్లల్లో పిల్లల ఆన్ లైన్ తరగతుల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ ఇచ్చే పరిస్థితులు లేవన్న వాదన వినిపిస్తోంది. విద్యార్థుల మధ్య అసమానతలు తలెత్తే విధంగా ఉన్న ఆన్ లైన్ విద్యను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈనెల 13న హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ కూడా తమ విధానాన్ని స్పష్టం చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాబట్టి.. ఆ రోజయినా.. స్పష్టత వస్తుందని తల్లిదండ్రులు, విద్యార్థులతో పాటు.. పాఠశాలల నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details