దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగం వినియోగంలోకి తెచ్చిన ‘పాపిలాన్’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేరపరిశోధనకు దన్నుగా నిలుస్తోంది. నిందితుల గుర్తింపులో కీలకంగా మారడంతో పాటు గుర్తు తెలియని మృతదేహాల ఆనవాళ్లు కనుక్కోవడం, పాస్‌పోర్ట్ జారీకి చేయాల్సిన ఎస్‌బీ విచారణలోనూ పోలీసులకు సరికొత్త అస్త్రంగా మారింది. ఈ సాంకేతికత సహకారంతో కుళ్లిన మృతదేహాలనూ గుర్తించ గలుగుతున్నారు. ఈ పరిజ్ఞానంతో గత ఏడాది 41 మంది మృతుల ఆనవాళ్లను గుర్తించగా.. ఈసారి ఇప్పటివరకు 17 మృతదేహాలు కనిపెట్టగలిగారు.
పాపిలాన్... పోలీసుల చేతిలో సరికొత్త అస్త్రం!
తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగం వినియోగంలోకి తెచ్చిన ‘'పాపిలాన్'’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం... విచారణలో పోలీసులకు సరికొత్త అస్త్రంగా మారింది. ఈ సాంకేతికత సహకారంతో నేరగాళ్ల సమాచారం, మృతదేహాలనూ గుర్తించడం, వివిధ సమాచారం క్షణాల్లో ఫలితాల్ని వెల్లడిస్తోంది.
పాస్‌పోర్టుల జారీలో కీలకమైన ఎస్‌బీ పోలీసుల విచారణ విషయంలో గతంలో గట్టి నిఘా ఉండేది కాదు. దరఖాస్తుదారుడు పేర్కొనే చిరునామా ఆధారంగా ఆ ఠాణాలో అతడి ప్రవర్తన గురించి విచారణ జరిపి కేసులేమీ లేకుంటే క్లీన్‌చిట్ ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏ ఠాణాలో కేసు నమోదైనా వాటి వివరాలు పాపిలాన్ పరిజ్ఞానానికి అనుసంధానమవుతున్నాయి. పాత నేరస్థుడైతే ఎస్‌బీ పోలీసుల చేతిలో ఉండే లైవ్‌స్కానర్‌లో వేలిముద్రను స్కాన్ చేసి తేల్చేస్తున్నారు. గత ఏడాదిన్నరలో ఇలా 111 మంది నిందితుల్ని గుర్తించగలిగారు. తెలంగాణ ఫింగర్‌ప్రింట్ బ్యూరో డేటాబేస్‌లో 9 లక్షల వరకు పాత నేరస్థుల వేలిముద్రలున్నాయి. వేలిముద్రల్ని స్కానర్లకు అనుసంధానం చేస్తే క్షణాల్లో ఫలితాల్ని వెల్లడిస్తోంది.
ఇదీ చూడండి:అసలేం జరుగుతోంది: కరోనా టెస్టుల్లో రోజుకో ఫలితం.. బాధితుల్లో అయోమయం!