రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లకు మరమ్మతులు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్లో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదార్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పదోన్నతులు పొందిన 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు కూడా పదోన్నతులు కల్పించాలన్న మంత్రి... అందుకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. కారోబార్లు, పంపు మెకానిక్ల సమస్యలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇంకా మిగిలి ఉన్న కొన్ని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు.