ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గేదెల్లంక పంచాయతీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ ఇతర సామాజికవర్గానికి చెందినవారు ఉప సర్పంచి పదవి దక్కించుకోవడం ద్వారా పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. కాట్రేనికోన మండలం చిర్రయానాం, నడవపల్లి పంచాయతీ స్థానాలూ మహిళలకే కేటాయించడంతో ఇక్కడా అదే పరిస్థితి నెలకొంది.
ఏలేశ్వరం మండలం లింగంపర్తి పంచాయతీ ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇక్కడ వైకాపా, జనసేన, తెదేపా.. ఉప సర్పంచి పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
క్షేత్రంలో.. కుర్చీలాట...
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పంచాయతీ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో స్థానికంగా పీఠాన్ని ఆశించిన నాయకులకు అవకాశం లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అతనికి అనుకూలమైన అభ్యర్థితో సర్పంచిగా నామినేషన్ వేయించారు. ఎన్నికల ఖర్చంతా ఆయనే పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఓ వార్డుకు సభ్యుడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా కలిసి ఈయన్నే ఉప సర్పంచిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ తెదేపా నాయకులు కూడా ఓ మహిళను రంగంలోకి దింపుతున్నారు. ఈమెకు సంబంధించిన ఎన్నికల ఖర్చు స్థానిక నాయకులు కొందరు భరించాలని నిర్ణయించారు.
ఉపసర్పంచి పీఠానికి పోటీ
రౌతులపూడి పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. దీంతో ప్రధాన పార్టీల నుంచి సర్పంచి పదవి ఎప్పట్నుంచో ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఉపసర్పంచి పీఠానికి పోటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైకాపా, తెదేపా నుంచి ఇద్దరేసి చొప్పున నాయకులు ఉప సర్పంచి పదవిపై దృష్టి పెట్టారు. వార్డుల్లో గెలిస్తేనే ఉపసర్పంచి రేసులో నిలిచే అవకాశం ఉండటం వల్ల ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై పావులు కదుపుతున్నారు.