తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వల్ల దారుణ పరిస్థితులు.. కోట్ల మంది పిల్లలు అక్షరాలకు దూరం - corona effect on education system

దేశంలో కరోనా వల్ల ఏడాదిగా పాఠశాలలు మూతపడి కోట్లాదిమంది బాలలు విద్యకు దూరమయ్యారని, దీన్ని ‘అత్యవసర పరిస్థితి’గా పరిగణించి చక్కదిద్దకపోతే భారత్‌ ఎంతో మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని విద్యారంగ నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణకుమార్‌ అన్నారు. విద్యలో దేశం ఇంతకాలం సాధించిన ప్రగతి దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మూతపడ్డ పాఠశాలలను తెరిపించేందుకు, విద్యకు దూరమైన పిల్లలను మళ్లీ పాఠశాలలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన అన్నారు. అంతకంటే ముందు విద్యార్థుల మీద కరోనా ప్రభావంపై ఒక సమగ్ర సర్వేను అత్యవసరంగా నిర్వహించాలని.. అప్పుడే దిద్దుబాటు చర్యలను ప్రణాళిక ప్రకారం చేయవచ్చంటున్న కృష్ణకుమార్‌తో ఈనాడు​ ముఖాముఖి.

Padma sree awardee krishna kumar interview
Padma sree awardee krishna kumar interview

By

Published : Apr 26, 2021, 5:02 AM IST

Updated : Apr 26, 2021, 9:23 AM IST

  • ప్ర: కరోనా రెండోదశ ప్రభావం విద్యారంగంపై ఎలా ఉండనుంది

స: కరోనా తొలిదశలో సొంతూళ్లకు వెళ్లిన కోట్లాది మంది వలస కార్మికుల పిల్లల చదువుల పరిస్థితిపై ఇప్పటిదాకా అధ్యయనం జరగలేదు. మెట్రో నగరాల్లో పెద్దసంఖ్యలో పిల్లలు విద్యకు దూరమయ్యారు.. తొలిదశ ప్రభావం తగ్గాక వలస కార్మికులు తిరిగి పని ప్రదేశాలకు వెళ్లినా పిల్లలను తీసుకు వెళ్లలేదు. ప్రైవేటు పాఠశాలలు లక్షల సంఖ్యలో మూతపడ్డాయి. వాటిలోని విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.

  • ప్ర: నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏం చేసి ఉండాల్సింది? ఇప్పటికయినా అవి చేపట్టాల్సిన చర్యలు ఏమిటి?

స: మొదటగా విద్యార్థులపై దీని ప్రభావం గురించి సమగ్ర సర్వే చేయించాలి. విశ్వసనీయమైన గణాంకాలు సేకరించాలి. క్షేత్ర పరిస్థితులపై కచ్చితమైన సమాచారం లేకపోతే దిద్దుబాటు ప్రణాళికల తయారీ సాధ్యం కాదు. ఈ ఏడాదిగా మధ్యాహ్న భోజన పథకానికి ఏ స్థాయిలో గండి పడింది, .అది చిన్నపిల్లల ఆరోగ్యంపై, పాఠశాలల్లో ప్రవేశాలపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశాలపైనా సర్వే జరగాలి. ఇంతకాలం నడిచి మూతపడ్డ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారనేది కీలకం. వీరిలో కొందరు ప్రభుత్వ పాఠశాల్లో చేరొచ్చు. వారి సంఖ్యను తెలుసుకోవాలి. అప్పుడే దానికనుగుణంగా ప్రభుత్వ పాఠశాల్లో అదనపు స్థలం, బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలను ఏమేరకు ఏర్పరచాలో తెలుస్తుంది. గ్రామీణ పేదలు, వలస కార్మికుల పిల్లలు, ప్రత్యేకించి బాలికలు పెద్దసంఖ్యలో చదువులు మానేశారని, బాలకార్మికులుగా మారుతున్నారని తెలుస్తోంది. వీరందరి వివరాలనూ సేకరిస్తే వాళ్లను మళ్లీ బడికి చేర్చేందుకు ఒక ప్రణాళికను రూపొందించవచ్చు.

  • ప్ర: సి.బి.ఎస్‌.సి., అనేక రాష్ట్రాల బోర్డులు కూడా పరీక్షలను రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో చేస్తున్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?

స: పదోతరగతి పరీక్షల రద్దు, 12వ తరగతికి పరీక్షల వాయిదా సమంజసమే. నిజానికి ఏడాదిగా 12వ తరగతికి ఆన్‌లైన్‌లోనే బోధన జరిగింది.. అందువల్ల పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే జరపవచ్చు. ఇదేమీ అసాధ్యం కాదు. డిజిటల్‌ పరికరాలు అవసరమైన పిల్లలకు తాత్కాలిక ప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం అనేక విశ్వవిద్యాలయాలు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి.. గత ఏడాదిగా వారు పూర్తి చేసిన అసైన్‌మెంట్లను బట్టి కూడా కొన్ని మార్కులు ఇవ్వడం మంచిది.

  • ప్ర: నాణ్యమైన విద్యను పొందడంలో పేద, ధనిక విద్యార్థుల మధ్య అంతరం పెరుగుతోంది. దీన్ని తగ్గించడం ఎలా?

స: మన దేశంలో కరోనాకు ముందూ ఈ అంతరం ఉంది. ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తోంది. దేశంలో ఉపాధ్యాయులకు కనీస వేతనాలను నిర్ణయించాలి. వారు ప్రభుత్వ రంగంలో పనిచేసినా, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసినా వాటిని వర్తింపజేయాలి. ఆ వేతనాలు ఇవ్వలేని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. అప్పుడే వాటికి నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు దొరుకుతారు. అలాగే కరోనా వల్ల మూతపడి మళ్లీ తెరుచుకునే ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాల స్థాపనకు కూడా ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయాలి. దీన్ని భారంగా చూడకూడదు. ఎందుకంటే ఆ పాఠశాలల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తే వారికి బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పనకు అంతకు మించి ఖర్చవుతుంది. బ్యూరోక్రటిక్‌ ప్రక్రియల వల్ల దీని అమలు కూడా ఆలస్యం అవుతుంది. విద్యార్థుల చదువుల మెరుగుకు ఏం చేయాలంటే అది చేయాల్సిందే. వేరే మార్గం లేదు.

  • ప్ర: నాలుగైదేళ్ల వయసు పిల్లలకు కూడా ఆన్‌లైన్‌ చదువులు జరుగుతున్నాయి. దీని ప్రభావం ఎలా ఉండనుంది?

స: ప్రపంచంలో మనదేశంలో తప్పించి మరెక్కడా కిండర్‌గార్టెన్‌, ప్రీస్కూల్‌ పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు జరిగిన దాఖలాల్లేవు. పిల్లల వికాసాన్ని, వారి మానసిక స్థితుల కోణం నుంచి చూస్తే ఇది మంచిది కాదు. ఇందుకు వేరే మార్గాలున్నాయి. ఇంట్లో పెద్దవాళ్లు లేదా పెద్దపిల్లల ద్వారా చిన్నారులకు ఏం నేర్పించవచ్చో ఆలోచిస్తే ఒక మార్గం దొరుకుతుంది. ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు చెప్పించిన నాలుగైదేళ్ల పిల్లలకు కరోనా ప్రభావం తగ్గాక కంటిదృష్టికి, మొత్తం ఎదుగుదలకు సంబంధించిన పరీక్షలను చేయిస్తే మంచిదని నా అభిప్రాయం. అసలు ఈ వయసు పిల్లలను ఒక పటాలంలా అనుసంధానపరచి చదువు చెప్పనవసరంలేదు.. నిజానికి వాళ్లను అలా వదిలేయవచ్చు కూడా.

  • ప్ర: కరోనా కారణంగా కోట్లమంది ఆదాయాలు కోల్పోయారు. అలాంటి కుటుంబాల పిల్లల చదువులు సవ్యంగా సాగాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి?

స: ఆ కుటుంబాలకు చెందిన ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందాలి. ఇలాంటి పిల్లలు కోట్లలో ఉంటారు. వీరిపై సర్వే పూర్తయ్యాక ఏ తరగతి వారికి ఎంత సాయం చేయాలో నిర్ణయించాలి. కరోనా వల్ల మూతపడ్డ ప్రతి ప్రైవేటు పాఠశాల మళ్లీ తెరుచుకునేలా ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయాలి. పాఠశాల ప్రైవేటుదా? ప్రభుత్వానిదా? అనేది ఇప్పుడు సమస్య కాదు? దానికి విద్యార్థులు ఉన్నారా? లేదా? అనేదే ఇప్పుడు ముఖ్యం. పరిస్థితులు మెరుగుపడ్డాక సహాయం కొనసాగింపుపై సమీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నది తీవ్ర సంక్షోభంలో. దానికి తగ్గట్టే స్పందించాలి. పాఠశాలలకు దూరమైన అందర్నీ మళ్లీ చదువుకు దగ్గర చేయకపోతే సార్వత్రిక విద్యలో భారతదేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ దేశం వెనక్కి వెళుతుంది. అందువల్ల విద్యారంగానికి సంబంధించి కూడా ప్రస్తుత దశను ‘అత్యవసర స్థితి’గా గుర్తించాలి.

- ఎన్​.విశ్వప్రసాద్

ఇదీ చూడండి:'టీకాలతోనే కొవిడ్‌ మహమ్మారి నుంచి రక్షణ సాధ్యం'

Last Updated : Apr 26, 2021, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details