ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. గతేడాది ఖరీఫ్ కంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పెరిగాయి. సాంకేతికత ద్వారా దళారుల ప్రమేయానికి ముగింపు పలికి నేరుగా రైతు ఖాతాలోకి కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
8 లక్షల రైతులు... 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటి వరకు 3,669 కొనుగోలు కేంద్రాల ద్వారా 8 లక్షల మంది రైతుల నుంచి 7,830 కోట్ల రూపాయల విలువైన 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. సన్నబియ్యం కొనుగోళ్లలో 53 కోట్ల రూపాయలు ఆదా కావడం విశేషం.
గర్వకారణం
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విధానాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు పరిశీలించాయి. భారీగా ధాన్యం దిగుబడులు జరిగే పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికార బృందాలు తెలంగాణ అవలంభిస్తున్న విధానాలపై అధ్యయనం చేయడం రాష్ట్రానికి గర్వకారణమని పౌరసరఫరాల వర్గాలు తెలిపాయి.
కలిసొస్తున్న ప్రభుత్వ పథకాలు
సాగు నీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతోంది. తెలంగాణ ఏర్పడక ముందు... ఏర్పడిన తరువాత పరిస్థితి గమనిస్తే ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లలో సాధించిన పురోగతి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది.
- 2014-15లో పౌరసరఫరాల సంస్థ 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా... 2018-19 నాటికి 77 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఈ ఐదు సంవత్సరాల్లో కొనుగోళ్లు 318 శాతం పెరిగాయి.
- గతేడాది ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ 8,09,885 లక్షల మంది రైతుల నుంచి 40.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
- ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటిదాకా 3,669 కొనుగోలు కేంద్రాల ద్వారా 8 లక్షల మంది రైతుల నుంచి 7,830 కోట్ల రూపాయల విలువచేసే 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా.
- నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాల - 4.10 లక్షలు, కామారెడ్డి - 3.91 లక్షలు, కరీంనగర్ - 2.90 లక్షలు, నల్లగొండ - 2.48 లక్షలు, పెద్దపల్లి - 2.47 లక్షలు, మెదక్ - 2 లక్షలు చొప్పున అత్యధికంగా కొనుగోలు చేశారు.
ఓపీఎంఎస్ విధానం
ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా తీసుకొచ్చిన ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం - ఓపీఎంఎస్ విధానం రైతులకు వరంగా మారింది. 2016-17 నుంచి 45.37 లక్షల మంది రైతులకు 38 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. తెలంగాణ మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన పంట పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు.
88 లక్షల కుటుంబాలు... 1.80 లక్షల మె.ట.బియ్యం
ఆర్థిక మాంద్యంలో సర్కారుకు ఎంత ఇబ్బందైనా రైతాంగం కోసం కావాల్సిన నిధులను సమకూర్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం రూపాయికే కిలో అందిస్తున్న పౌరసరఫరాల శాఖ... ప్రతి నెలా 88 లక్షల కుటుంబాల్లోని 2.83 కోట్ల మందికి 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది.
కృతజ్ఞతలు
పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి శనివారం నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా పౌరసరఫరాల సంస్థ, శాఖ అధికారులు, ఉద్యోగులు.. శ్రీనివాస్‌రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మరింత నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని ఛైర్మన్ అన్నారు. పేద ప్రజలు, రైతుల సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఇటువంటి విభాగంలో తనకు పనిచేసే సదావకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.