Governor Tamilisai Sundararajan: పశువైద్య రంగంలో సవాళ్లు అధిగమిస్తూ వెటర్నరీ పట్టభద్రులు గ్రామీణ పేదలకు సేవలందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో.. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం జరిగింది. దిల్లీ నుంచి గవర్నర్ వర్చువల్ వేదికగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2020-2021 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వెటర్నరీ బీఎస్సీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు 478 మందికి... పట్టాలు ప్రదానం చేశారు. 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు వరించాయి. వీరిలో వెటర్నరీ బీఎస్సీ పట్టభద్రురాలు పొట్లపల్లి స్వేత మూడు బంగారు పతకాలు, పౌల్ట్రీ సైన్స్ బీటెక్ పట్టభద్రుడు నూకల వెంకటరెడ్డి రెండు చొప్పున బంగారు పతకాలు అందుకున్నారు.
'పశువైద్య రంగంలో సవాళ్లు అధిగమిస్తూ వెటర్నరీ పట్టభద్రులు గ్రామీణ పేదలకు సేవలందించాలి. విధి నిర్వహణలో పూర్తి నిబద్ధతతో పని చేయడం ద్వారా రైతుల ఆదరణ పొందాలి. పశు, మత్స్య, కోళ్ల రంగాలతో ఉత్పత్తి, సంక్షేమం, ఆహార భద్రత, ప్రజా ఆరోగ్యం ఆధారపడి ఉన్నందున గ్రామీణాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ఆ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మానవాళి ఆరోగ్యంలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా పశువుల ఆరోగ్యం బాగుండాలని... అందుకు అనుగుణంగా తరచూ సోకే రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పశువైద్యులు కృషి చేయాలి. కొవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం, కొత్తకొత్త వాణిజ్య పంటలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయంగా అభివృద్ధి చేసిన పశు జాతుల రకాలను శాస్త్రవేత్తలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలి.'
-గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
'రెండు గోల్డ్ మెడల్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఈ మెడల్స్ సాధించాను. ప్రస్తుతం ఫౌల్ట్రీ సైన్స్‌లో పీజీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు డాక్టర్ మహిపాల్‌రెడ్డి, సీవీ రెడ్డి అనే రెండు గోల్డ్ మెడల్స్ ఫౌల్ట్రీ సైన్స్ విభాగంలో వచ్చాయి. నా చిన్నప్పటి నుంచి ఈ కోర్సు చేయాలని ఉండేది. ఇప్పుడు అది సాకారం అయ్యింది.'