అత్యవసర స్థితిలో ప్రాణాలు నిలబెడుతున్న ఆక్సిజన్ కరోనా బాధితులకు ఆక్సిజన్.. సంజీవనిలా మారింది. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నవారి ప్రాణాలు నిలబెడుతోంది. తొలి దశలో 50 ఏళ్లు దాటినవారికే ఆక్సిజన్ అవసరమయ్యేదని.. ఇప్పుడు 25 ఏళ్ల వారికీ ఇవ్వాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు.
90 శాతం కన్నా తక్కువ ఉంటే..
వైరస్ సోకిన వారిలో కొందరిలో.. ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్ము వల్ల.. బయట నుంచి స్వీకరించే ప్రాణవాయువు రక్తంలో కలవదు. దీని వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి.. ఆయాసం, తలనొప్పిలో బాధపడుతున్నారు. కొందరు స్పృహ తప్పి పడిపోతున్నారు. గుండె, మెదడు, మూత్రపిండాల్లాంటి కీలక అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగినంత అందక.. వాటి పనితీరు దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. పల్స్ఆక్సీమీటర్లో రీడింగ్ 90 శాతం కన్నా తక్కువ ఉంటే.. ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇస్తున్నారు. ఇదే సమయంలో... 24 గంటల్లో రోగి నుంచి రెండు సార్లు రక్తాన్ని తీసి.. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ పరీక్ష చేసి.. ఆక్సిజన్ కొనసాగించాలా.. వద్దా.. అనేది నిర్ధరిస్తారు. ఏబీజీ రిపోర్టులో 80 శాతం కన్నా ఎక్కువగా ఆక్సిజన్ ఉంటే.. నెమ్మదిగా రెండు లీటర్ల చొప్పున తగ్గించుకుంటూ వస్తారు. సొంతగా శ్వాస తీసుకోగలిగితే.. ఆక్సిజన్ సరఫరాను ఇంకా తగ్గిస్తారు. ఈ స్థితిలో ఉన్న రోగులకు సాధారణంగా 5 నుంచి 7 రోజుల పాటు ఆక్సిజన్ను అందిస్తున్నారు.
కీలకంగా ఆక్సీమీటర్..
ఒక సిలిండర్లో 6 వేల నుంచి 7 వేల లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. నిమిషానికి 15 లీటర్ల చొప్పున ఫ్లో రేటును నిర్ధరిస్తే.. కరోనా బాధితుడికి గంటకు 900 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. పల్స్ ఆక్సీమీటర్ రీడింగ్ 90 నుంచి 94 శాతం మధ్య ఉంటే.. దాదాపు 4 రోజులు నిరంతరాయంగా ఆక్సిజన్ అందిస్తారు. ఏబీజీ చేసి.. ఆక్సిజన్ శాతాన్ని గుర్తిస్తూ సరఫరాలో మార్పులు చేస్తారు. 6 నిమిషాల నడకకు ముందు, తర్వాత ఆక్సీమీటర్ రీడింగ్‌లో 4 శాతం హెచ్చుతగ్గులు కనిపిస్తే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయానికి ప్రాణవాయువు ఇవ్వడం వల్ల.. రక్తంలో తగ్గిన ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నా పెద్దగా నష్టం చేయదు. దీని వల్ల.. కొద్దిరోజులకే రోగులు కోలుకుంటున్నారు. ఆక్సిజన్‌తో పాటు స్టెరాయిడ్స్, రక్తాన్ని పలుచన చేసే ఇంజక్షన్లు కూడా రోగి ప్రాణాల్ని నిలబెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆసుపత్రికి తరలించేలోగా.
బోర్లా పడుకుంటే.. ఊపిరితిత్తుల్లోకి గాలి ఎక్కువగా వెళ్లి.. అవయవాలు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఈ ప్రక్రియనూ కొనసాగించాలని చెబుతున్నారు. ఆక్సీమీటర్లో ఆక్సిజన్ స్థాయి 94, అంతకంటే తక్కువకు పడిపోయినపుడు.. బాధితులను ఆసుపత్రికి తరలించేలోగా... ఇలా బోర్లా పడుకోబెడితే.. ప్రమాదం కొంతవరకు తప్పుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:ప్రజా ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది: విజయశాంతి